- టీజేఎస్ నే ధర్మార్జున్తో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆర్డీఆర్ భేటీ
విధాత : ఉద్యమ ఆకాంక్షల సాధనకే కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి సాగుతున్నాయని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. దామోదర్‌రెడ్డిలు వెల్లడించారు. శనివారం దామోదర్‌రెడ్డి ఎన్నికల్లో తనకు టీజేఎస్ మద్దతుగా ప్రచారంలోకి రావాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తెలంగాణ జనసమితి కార్యాలయంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్‌ను, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గట్ల రమా శంకర్ లను కలిసి అభ్యర్థించారు.
ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు, తెలంగాణ ప్రజలను నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం బారి నుంచి కాపాడేందుకు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ధర్మార్జున్ మాట్లాడుతూ ప్రజలందరి ఉమ్మడి పోరాటాల ఫలితంగా, అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆరెస్ ఉద్యమ ఆకాంక్షలకు, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చిందని విమర్శించారు.
అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కుప్ప కూల్చి, రాష్ట్రాన్ని ఒక కుటుంబజాగీరుగా మార్చుకుని అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదన్నారు. నిధులన్ని తన కుటుంబానికి మళ్లీంచుకుని అశాస్త్రీయంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన నీళ్ళ ప్రాజెక్టులు కుంగిపోయి ప్రమాదంలో పడ్డాయియని విమర్శించారు. కాలువల్లో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు పారుడేమోగాని ఆ పేరుతో కేసిఆర్ సాగించిన అవినీతి డబ్బుల కట్టలు ఎన్నికల్లో ప్రవహిస్తున్నాయి అని ఎద్దేవా చేశారు.
అధికారదాహం, అవినీతి మత్తులో మునిగిపోయి చట్టబద్ధ పాలన లేని ఈ రాష్ట్రంలో నియామకాలు లేకుండా నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసు లేకపోగా, వరుస పేపర్ లీకేజీలతో పోటిపరీక్షలు మళ్లీ మళ్లీ రాయలేక ఉద్యోగాలు రావేమోనని నిరుద్యోగ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. మరోవైపు ధరణి పేరుతో రెవెన్యూ రికార్డులను గందర గోళం చేయడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్ధిక, సామాజిక జీవనాన్ని పూర్తిగా విధ్వసమైందన్నారు. ప్రజాస్వామ్య విలువలను, తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను పాతరేసిన నియంతృత్వ కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడకపోతే అసాధారణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణాను కాపాడుకోలేమన్నారు. అందుకే టీజేఎస్ ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల గెలుపు కోసం కాంగ్రెస్‌కు మద్దతునిస్తుందని, టీజేఎస్ సూచించిన ఎజెండా అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అమలు చేస్తుందన్న హామీతో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నామన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధనకు టీజేఎస్ ఎజెండా అమలుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని టీజేఎస్ కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాబోయిన కిరణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు వేనారెడ్డి, పోతు భాస్కర్, జనసమితి నాయకులు చంద్రకాంత్, బంధన్, వినయ్ గౌడ్ కృష్ణారెడ్డి,రఫీ, బచ్చాల కూరి గోపి, జాటోత్ శ్రీను నాయక్, సుమన్, వల్కి గోవర్ధన్, యాకూబ్ రెడ్డి, తండు రాములు సామా శ్రీనివసరెడ్డి,సూర్యనారాయణ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.