Site icon vidhaatha

ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు.. విభజన కంటే వైసీపీ విధ్వంస పాలనతోనే ఎక్కువ నష్టం : సీఎం చంద్రబాబు

ఏపీలో గెలుపుకు తెలంగాణ టీడీపీ శ్రేణుల కీలక భూమిక
తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీని మళ్లీ పునర్నిర్మిస్తాం
గొడవలు పడితే ఇబ్బందులే తప్ప నీళ్లు రావు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం

విధాత, హైదరాబాద్ : గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వినిపించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం ఎన్‌.చంద్రబాబానాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ టీడీపీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టిన టీడీపీ పార్టీకి పునర్ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేశానని, తెలుగు జాతీ ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించానని, ఈరోజు ఆలోచిస్తున్నానని, నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు అదే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే అని గుర్తు చేశారు.

తెలుగు జాతికి అన్యాయం జరిగిందని వారికి అండగా నిలబడడానికి తెలుగు దేశం పార్టీ పెట్టారని తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్ధుతో పాటు ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బడుగు, బలహీన వర్గాలు రాజకీయాల్లో ప్రాబల్యంలోకి రావడానికి ఎన్టీఆర్ కారణమన్నారు. 2004లో తెలంగాణలో అధికారం కోల్పోయిన టీడీపీలో ఇప్పటికి ఉత్సాహం తగ్గలేదన్నారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందన్న నమ్మకముందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ నుండి నాయకులు పోయారు.. కానీ కార్యకర్తలు వెళ్ళలేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతి ఉన్న వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. తెలుగు జాతీ మాదిరిగానే తెలుగు దేశం పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కోని వాటిన్నింటిని అధిగమించి తన జైత్రయాత్ర కొనసాగిస్తుందన్నారు.

జైలులో ఉన్నప్పుడు హైదరాబాద్ వాసుల సంఘీభావం మరువలేనిది

నన్ను జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే, హైదరాబాద్‌లో ఇక్కడి ప్రజలు ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలిచిన తీరు నేను జీవితంలో మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని 70కిపైగా దేశాల్లో తెలుగువారు నాకు మద్దతుగా రోడ్డెక్కారన్నారు. సంక్షేమంలో, ఆర్ధిక సంస్కరణలలో దార్శనికులైన ఎన్టీఆర్‌, పీవీ.నరసింహారావులు చేసిన కృషి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, దేశాభివృద్ధికిలో చెరగని ముద్ర వేశాయన్నారు. తెలుగు దేశంకు ముందు తర్వాతా అన్నట్లుగా తెలుగు జాతీ చరిత్ర తీసుకోవచ్చని చెప్పారు. ఫ్లైట్‌లో వస్తుంటే హైటెక్ సిటీని చస్తే ఎంతో ఆనందం కల్గిందని, టీడీపీ ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణంతో చేసిన అభివృద్ధితో హైదరాబాద్ దేశంలోనే ఐటీ రంగంలో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఏ నాయకుడికైనా, పార్టీకైనా దీనికంటే మరో తృప్తి ఉండదన్నారు. నేను చేసిన అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం అభివృద్ధిని పరుగులు పెట్టించిందన్నారు. నాలెడ్జ్ ఎకానమీగా హైదరాబాద్‌ను నిలిపిన ఘనత టీడీపీదేనన్నారు. తన కృషితో మొదలైన అభివృద్ధిని తదుపరి కాంగ్రెస్‌, బీఆరెస్ ప్రభుత్వాలు చెడగొట్టలేదని, ముందుకు తీసుకెళ్లాయని తెలిపారు.

ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి అభివృద్ధిని ముందుకు తీసుకెలుతుందన్నారు. నేను రాష్ట్ర విభజన సమస్యలపై చొరవ తీసుకుని ముందుగా రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అందుకు ధన్యవాదాలన్నారు. తెలుగు జాతీ ఒక్కటేనని, అన్నదమ్ముళ్లు వీడిపోయిన సందర్భంలో కొన్ని సమస్యలు, భావోద్వేగాలుంటాయని అవి శాశ్వతంగా ఉండరాదని, తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు వేరైనా, ఎవరి పాలన వారిదైనా, ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలన్నారు. అన్నదమ్ముళ్లు, రెండు రాష్ట్రాలు వీడిపోయిన తర్వాతా ఎవరి కుంపటి వారిదేనని, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారని, కలిసి పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రెండు రాష్ట్రాలు వీడిపోయాక రాజ్యసభ సభ్యులు తగ్గిపోయారని, ఏ సమస్య వచ్చినా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం వద్ద నేను ముందుంటానన్నారు.

గొడవలతో నీళ్లు రావు….సమస్యలు పరిష్కారం కావు

కొంతమంది రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్నారని, వాళ్ల ధోరణీ మార్చుకోవాలని చంద్రబాబు కోరారు. గోడవలతో నీళ్లు రావని, సమస్యలు పరిష్కారం కావని, లాభం కంటే నష్టం వస్తుందని, దానికంటే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోని ముందుకెళితే మంచిదని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మనోభావాలు, సమస్యలున్నాయని వాటిని గౌరవిస్తునే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, సిద్ధాంతపరంగా విభిన్న ఆలోచనలున్నప్పటికి తెలుగు జాతీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాల్సివుందన్నారు. ఆ దిశగానే నిన్న జరిగిన సీఎంల చర్చలు ముందుకు తీసుకెలుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది అందుకు విరుద్ధంగా ఆలోచన చేయడం మానుకోవాలన్నారు. తాను హైదరాబాద్ అభివృద్ధి చేసినందునే విభజన సమస్య ఎదురైందని గతంలో అన్నారని, అయితే అభివృద్ధి రాజధాని నుంచి గ్రామాలకు చేరుతుందని తాను చెప్పగా అదే జరిగిందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో సీఎంగా చేశానని, ఏపీకి రెండోసారి సీఎంగా పనిచేస్తున్నానని, పదేళ్లు ప్రతిపక్షంలో పనిచేశానని, నా రికార్డులు ఎవరు చేరుకోలేరని, మరో జన్మంటు ఉంటే ఇంతటి ఘనకీర్తిని నాకు కట్టబెట్టిన తెలుగు గడ్డపైనే మళ్లీ జన్మించాలని కోరుకుంటున్నానన్నారు.

విభజన కంటే వైసీపీ విధ్వంస పాలనతోనే అధిక నష్టం

రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 35శాతం ఎక్కువగా ఉందని దానికి కారణం హైదరాబాద్ చంద్రబాబు పేర్కోన్నారు. తాను ఏపీ సీఎంగా ఐదేళ్లలో చేసిన కృషితో తలసరి ఆదాయ వ్యత్యాసం 27.5శాతానికి తగ్గించామన్నారు. మళ్లా వైసీపీ విధ్వంసక ప్రభుత్వం రాకతో ఐదేళ్లు ఇష్టానుసారంగా చేయడంతో 44శాతం వ్యత్యాసంకు చేరుకుందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే వైసీపీ విధ్వంసం పాలనతోనే అధిక నష్టం జరిగిందన్నారు. ఈ దఫా టీడీపీ రాకపోయి ఉంటే తెలంగాణతో పోల్చితే ఏపీ తలసరి ఆదాయంలో 100శాతం తేడా ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణకు మంచి బేస్ వచ్చిందని, దీన్ని నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లడానికి ఇక్కడి పాలకులకు అవకాశం ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ఏపీని అభివృద్ధి గట్టేక్కించే బాధ్యత నాదేనన్నారు. విజన్ 2020తయారుచేసినప్పుడు నన్ను 420విజన్ అని విమర్శించారని, సెల్‌ఫోన్ గూర్చి మాట్లాడితే అది తిండిపెడుతుందా అన్నారని, హైదరాబాద్‌లో రోడ్లు వెడల్పుకు ప్రయత్నిస్తే అడ్డుపడ్డారని, వాటన్నింటిని పట్టించుకోకుండా ముందుకెళ్లానన్నారు.

2047నాటికి భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే వికసిత భారత్‌లో నెంబర్ వన్ కమ్యూనిటీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్‌గా ఉంటే అందులో 35శాతం తెలుగు వారుండాలన్నారు. ఒకప్పుడు హైటెక్ సిటీ నిర్మిస్తే తిండి పెడుతుందా అని ఎద్దేవా చేశారని, ఇప్పుడు వారి పిల్లలు ఐటీలో పనిచేస్తూ వారికి తిండిపెడుతున్నారన్నారు. తెలుగు ప్రజలు గ్లోబల్ సిటిజన్స్‌గా ఉండాలని, తెలుగు జాతీ గ్లోబల్ లీడర్‌గా ఉండాలన్నారు. కార్పోరేట్‌, పబ్లిక్ గవర్నర్స్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ పార్లమంటులో నేడు 25మంది భారతీయ సంతతి వారు ఉండటం దేశ ప్రజల సత్తాకు నిదర్శనమన్నారు. ప్రపంచంలో అందరికి ఆమోదనీయులలో భారతీయులు అగ్రగామిగా ఉంటే అందులో తెలుగు జాతీ ముందుంటుందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని తెలుగు జాతీ అభివృద్ధికి నిరంతరంగా పనిచేస్తానన్నారు.

చర్చల ద్వారా సమస్యల సాధన

రెండు రాష్ట్రాల ప్రయోజనాల దిశగా నిన్న సీఎంల సమావేశంకు తొలి అడుగు వేశామని, రాబోయే రోజుల్లో అధికారిక కమిటీలు వేసుకుంటామని, చర్చల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకుంటామని, రాబోయే రోజుల్లో జాతీ ప్రాతిపాదికన పనిచేస్తే ఏ సమస్య ఉండదన్నారు.
మీరు నాకు అధికారమిస్తే నేను మీకు సేవ చేశానని, జీవితాంతం వరకు ప్రజల కోసం ఏమి చేయాలో అది చేస్తానన్నారు. రాబోయే 30ఏండ్ల కోసం ఇప్పుడే విజన్ తయారు చేసుకుని ముందుకెళ్లడమే నా పద్దతి అన్నారు. ఏపీలో ఎన్నికలు వస్తే సీనియర్ల కంటే యువకులకు ప్రాధాన్యతనిచ్చానని, ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. టీడీపీ చరిత్రలో అతిపెద్ద సునామీ వంటి విజయం అందించారన్నారు. ఫ్రజాస్వామ్యంలో విర్రవీగితే ప్రజలు ఎక్కడకు పంపించాలో అక్కడకు పంపిస్తారని, అదే విషయం నేను పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నానన్నారు. సీబీఎన్ 95లో ఏ విధంగా పనిచేశాడో మునుముందు కూడా అదే రీతిలో పనిచేస్తానన్నారు. ఆ రోజు శ్రమదానం, జన్మభూమి వంటి అనేక కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన సంస్కరలతో సాగిందన్నారు. ఆరోజు సైబరాబాద్ అంటే నన్ను ఎగతాళి చేశారన్నారు. బిల్ క్లింటన్‌ను పిలిపించి ఆ పేరు పెట్టామని, అప్పుడే మన టెక్నాలాజీ చూసి ఆయన అశ్చర్యపోయారన్నారు.

తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణం

తెలంగాణలో 20ఏండ్లుగా ప్రతిపక్షంలో ఉన్నామని, తెలంగాణలో తెలుగు దేశం ఉండాలా లేదా, తెలుగు ప్రజల కోసం టీడీపీ ఉండాలా లేదా, తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ ఉండాలా లేదా అంటు చంద్రబాబు ప్రశ్నించారు. త్వరలోనే ఇక్కడ పార్టీ పునర్నిర్మిస్తామని, యువతకు పెద్దపీట వేస్తానన్నారు. ఏపీ, తెలంగాణకు వేర్వేరు టెక్నాలాజీతో ఆలోచన చేసి ముందుకెలుదామన్నారు. మీడియా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం నా ప్రయత్నాలకు సహకరించాలని, కొందరూ ఇప్పటికి కూడా నా పై వక్రీకరణలు చేస్తున్నారని, జవాబుదారి తనంతో కెలుతామన్నారు. త్వరలోనే మళ్లీ వస్తానని, ఏపీలో పరిస్థితులు చక్కదిద్ధి తెలంగాణలో పార్టీకి సమయం కేటాయిస్తానని, పార్టీకి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తానన్నారు. హేరిటేజ్‌, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఈ ప్రాంతంలో సేవలందిస్తుందన్నారు. టీడీపీ పార్టీయైనా, సంస్థలైనా ప్రజాసేవనే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. మళ్లీ నేను వేసే ఫౌండేషన్‌తో 30ఏళ్లకు పైగా పనిచేసే నాయకత్వంతో ముందుకెలుతామన్నారు. ఏపీలో ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కల్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ భేషరతుగా జైలులో ఉన్న తన వద్దకు వచ్చి పొత్తు ప్రకటన చేశారని, బీజేపీ కూడా కలిసివచ్చిందన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజు 70రైళ్లు నిండుగా వచ్చి జాతరకు వచ్చినట్లుగా వచ్చి ఓటేశారన్నారు. ఎన్నారైలు ఎందరో లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేశారన్నారు. అందరి రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానన్నారు. టీడీపీ కూటమి సునామి విజయంతో సైకో భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేలా పనిచేస్తానన్నారు. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు వస్తే ఏమీ జరుగుతుందో ఐదేళ్ల వైసీపీ పాలన నిదర్శనమని, రాజకీయాల్లో మంచివాళ్లు వస్తే ఏలా ఉంటుందో నేను చేసి చూపించాల్సివుందన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, సంక్షోభంలో అవకాశకాలు వెతుక్కుని ముందుకెళ్లడం నా నైజమని, 1995లో కూడా హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితిని అధిగమించామని గుర్తు చేశారు.

చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం

నాల్గవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు దారి పోడవునా దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘనంగా సన్మానించి సత్కరించారు.

Exit mobile version