తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇందుకు హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తున్నారు కేసీఆర్.
ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటనకు బయల్దేరారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి దేవరకద్రకు బయల్దేరిన సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్.. మళ్లీ హెలికాప్టర్‌ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే మళ్లించారు.
అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. అయితే సీఎం తన పర్యటనను రద్దు చేసుకోలేదని, మరో హెలిక్యాప్టర్ రాగానే యథావిధిగా కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. మరో హెలికాప్టర్ కోసం ఏవియేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.