Site icon vidhaatha

మాతో టచ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు అంత బీజేపీలో చేరడం ఖాయం : రామచందర్ రావు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు మాతో టచ్ లో ఉన్నారని..ప్రస్తుతం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ఖాయమని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని..అది కేసీఆర్ కుటుంబం ఏటీఎం అని చెబుతున్న విషయం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో రుజువైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అనుసరించి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసీఆర్ కుటుంబం పాత్ర గురించి లోతుగా విచారణ చేసి, అవినీతికి కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. కాళేశ్వరం కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా సీబీఐకి వెంటనే అప్పగించాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.

ఇంజనీర్లు, నిపుణులు, మంత్రులకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబం నిర్ణయం తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. ఇంతవరకు కాళేశ్వరం అవినీతిపై బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కాంట్రాక్టర్లతో లాలూచీ పడి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతంలో 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందుని..దీనికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇస్తే తాము స్వయంగా కేంద్రాన్ని ఒప్పించి అనుమతులు, ఆర్థిక సహకారం ఇప్పిస్తామని హామి ఇచ్చారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనిచ రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తధ్యమని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version