Telangana : రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేత, అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీ: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ బీసీ రిజర్వేషన్లకు 42% కోటా, అజహారుద్దీన్, కోదండరామ్ ఎమ్మెల్సీలుగా సిఫార్సు నిర్ణయం.

Revanth reddy

విధాత, హైదరాబాద్ : రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (ఎ)ను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బీసీల రిజర్వేషన్లు సహా కీలక అంశాలపై చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతం ఇవ్వడానికి వీలుగా చట్ట సవరణ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ చేపడితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బందులు లేకుండా పోతాయి. రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో ఇవ్వనున్నారు. స్పెషల్ జీవోతో బీసీ రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. కోదండరామ్, అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరి పేర్లను రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది.

శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మంత్రుల కమిటీ న్యాయ నిపుణులతో చర్చించింది. న్యాయ నిపుణుల సలహాలను కమిటీ కేబినెట్ దృష్టికి తెచ్చింది. దీనిపై సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఇటీవల కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల ఎమ్మెల్సీల విషయంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు స్టే విధించింది. అయితే మరోసారి కోదండరామ్, అమీర్ అలీఖాన్ స్థానంలో అజహారుద్దీన్ పేరును ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో కేబినెట్ సిఫారసు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే తరుణంలో అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆయనను రేసు నుంచి తప్పించారు.