సవరణ బడ్జెట్‌తో న్యాయం చేయాలని డిమాండ్
విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. బడ్జెట్ సవరణ చేసి తెలంగాణకు నిధులు కేటాయించాలని, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశకు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయన్నారు. తెలంగాణలోని పాత జిల్లాలలో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చి దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు.
తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి లేఖలు రాశామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సైతం తీర్మానం పంపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరేకించడం లేదని, తెలంగాణకు కేటాయింపులు జరపాలని కోరినట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆరెస్ పార్టీ బీజేపీతో రాజీపడిందని ఆరోపించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామని, తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారన్నారు. ప్రధాని కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు.