హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విధాత):
CM Revanth Reddy | పార్టీ మారిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కడియం శ్రీహరి మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సమాధానం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ తరుణంలో సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఇందులో భాగంగానే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాటికి గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు మీడియాకు తెలిపారు. వారం రోజుల క్రితం అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ మరోసారి సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణ, స్పీకర్‌కు పంపాల్సిన సమాధానంపై చర్చించినట్టు తెలుస్తున్నది.
స్పీకర్ నిర్ణయంపైనే ఉత్కంఠ
మూడు నెలల్లోపుగా బీఆర్ఎస్ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయంపై ఎలా ఉంటుందనేది ఇంకా సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యేలను స్పీకర్ వివరణ కోరుతారు. రాత పూర్వకంగా ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానాలతో పాటు ముఖాముఖి ఎమ్మెల్యేలతో కూడా స్పీకర్ మాట్లాడుతారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి ఎంతకాలం సమయం పడుతోందోననేది స్పష్టత లేదు.
బీఆర్ఎస్ వాదన ఏంటి?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలతో స్పీకర్ కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ చెబుతోంది. వీటి ఆధారంగా ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అలా జరిగే ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ నమ్మకం. అందుకే ఈ 10 నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది.