విధాత, హైదరాబాద్ : రేపు జరుగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల( Telangana Panchayat Elections) పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల( SEC) కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగునుందని తెలిపారు. తొలి విడతలో 3,836సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని, 12960 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీపడుతున్నారని, 27,960వార్డులకు రేపు పోలింగ్ జరుగనుందని తెలిపారు. 56 లక్షల 19 వేల 430 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించేందుకు అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లకు అన్ని విధాలా సహకరించేందుకు అబ్జర్వర్లు పోలింగ్ పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
బందోబస్తు, శాంతిభద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలింగ్ పూర్తికాగానే కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు. 50వేల మంది సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారని, 60 ప్లటూన్స్ బృందాలు బయటి నుంచి వచ్చాయని ఎస్‌ఈసీ తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు.
