Site icon vidhaatha

తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రారంభంపై మార్గదర్శకాలు జారీ

ఒకరోజు ‘ప్రథమ’..మరుసటి రోజు ‘ద్వితీయ’
అందుబాటులో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ బోధన

విధాత,హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒక రోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం వారికి తరగతులు నిర్వహిస్తామని ఇంటర్‌ విద్యాశాఖ తెలిపింది.ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ తరగతులు రెండూ అందుబాటులో ఉంటాయని, ఏ విధానంలో హాజరుకావాలన్నది విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులకు రావద్దనుకుంటే ఇంటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావొచ్చని, ప్రత్యక్ష తరగతులకు రావాలనుకుంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరని తెలిపింది. ఈ మేరకు కమిషనర్‌ జలీల్‌ మార్గదర్శకాలు జారీచేశారు. ఇంటర్‌ కళాశాలలను జులై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో జులై 1న ప్రథమ సంవత్సరం తరగతులు, 2న ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నారు.
ఈ ఏడాదీ 70 శాతం సిలబస్సే
‘‘ప్రత్యక్ష తరగతులు లేని రోజు టీవీ పాఠాలుంటాయి. అధ్యాపకులు జూమ్‌ తరగతులు కూడా తీసుకుంటారు. మొత్తం 220 పనిదినాలలో 110 రోజులు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయి. పనిదినాలపై సందిగ్ధత పరిస్థితి ఉన్నందున ఈసారి కూడా 70 శాతం సిలబస్సే ఉంటుంది. అధ్యాపకులు సంవత్సరం, సబ్జెక్టుల వారీగా వాట్సప్‌ గ్రూపులు స్పష్టించి విద్యార్థుల సందేహాలు తీర్చాలి. విద్యార్థుల ఈమెయిల్‌ ఐడీ తీసుకొని అసైన్‌మెంట్లు, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు పంపించాలి. తరగతి గదిలో 45 మందికి మించి కూర్చోబెట్టరాదు’’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Exit mobile version