విధాత, హైదరాబాద్ : సహకార సంఘాల పాలక వర్గాల( cooperative societies committees) కోసం ఎన్నికల ప్రక్రియ నిలిపివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్( nominated governing bodies) పాలక వర్గాలను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విధి విధానాలు ఖరారా చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(PACS), డీసీసీబీల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగిసిపోగా..అనంతరం ఆగస్టు 14న నిరవధికంగా పదవీ కాలాన్ని పొడిగించారు. తాజాగా 980పీఏసీఎస్, 9 డీసీసీబీల పాలవర్గాలను రద్దు చేస్తూ..అధికారిక పర్సన్ ఇన్ చార్జ్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సహకార సంఘాలు, డీసీసీబీలను పునర్ వ్యవస్థీకరించి వాటికి సంక్రాంతి లోపు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
సంఘాల పెంపు..నామినేటెడ్ పాలక వర్గాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 33జిల్లాలు ఉండగా..9డీసీసీబీలు మాత్రమే ఉన్నాయి. మండలాల వారిగా చూస్తే 81మండలాల్లో పీఏసీఎస్ లు లేవు. 272మండలాల్లో ఒక్కో సంఘం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకార విధానం మేరకు ప్రతి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం, మత్స్య, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. కొత్త సంఘాలకు ప్రతిపాదనలను సిద్దం చేసింది. కొత్తగా 131పీఏసీఎస్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సహకార శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీటికి ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఉున్న 908సంఘాల సంఖ్య 1039కి పెరుగనున్నది.
నామినేటెడ్ పాలకవర్గాలతో పార్టీ కేడర్ కు పదవులు
పీఏసీఎస్ లకు ఇప్పటిదాక ఎన్నికల ద్వారా భర్తీ చేస్తున్న పాలకవర్గాల స్థానంలో నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎలాగు రాష్ట్రంలో అధికార పార్టీకి సహజంగానే మెజార్టీ సహకార సంఘాలు దక్కుతాయని..ఈ మాత్రం దానికి ఎన్నికల నిర్వహణ, అందుకు ఖర్చులు, చైర్మన్ల కోసం క్యాంపు రాజకీయాలు ఇదంతా అనవసరం అని ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయ మార్కెట్ తరహాలో నామినేటెడ్ పాలక వర్గాలను ఏర్పాటు చేస్తే ఇటు ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ భారం తప్పడంతో పాటు అధికార పార్టీ నేతలకు నామినేటెడ్ పద్దతిలో పదవుల యోగం కల్పించవచ్చని ప్రభుత్వ తలపోస్తున్నది. ప్రస్తుతం ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్, వైస్ చైర్మన్ సహా 13మందితో పాలక వర్గాలు ఎన్నికవుతూ వస్తున్నాయి. వీటీ నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్, మార్క్ ఫెడ్ డైరక్టర్లు, చైర్మన్లు ఎన్నికవుతున్నారు. వాటన్నింటికి ఎన్నికల పద్దతిలో కాకుండా నామినేటెడ్ పద్దతిలో పాలక వర్గాలను భర్తీ చేస్తే 12వేల మంది వరకు అధికార పార్టీ నేతలకు గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పదవులు కల్పించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అయితే సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్నవారినే పాలకవర్గాలలోకి నామినేటెడ్ చేయాలని భావిస్తున్నది. సహకారం సంఘాల పాలకవర్గాల భర్తీ విధానంపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది.
