ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరే కీలకం
మూడు పార్టీలు జిల్లా పై కేంద్రీకరణ
నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీ ప్రచారం
ప్రచారంలో పాల్గొన్న ప్రధాన నేతలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఎన్నికగా వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వరంగల్ జిల్లా ఓటరు కీలకపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్, బీఆరెఎస్, బిజెపి మూడు ముఖ్యమైన పార్టీలు వరంగల్ జిల్లా పట్టభద్రుల పై దృష్టిని పెట్టాయి. మూడు పార్టీల నాయకులు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు జిల్లాలో కలియతిరిగారు. కాంగ్రెసులో మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా బాధ్యత వహిస్తున్నారు.
ఇద్దరూ వరంగల్ జిల్లా అభ్యర్థులే
మూడు పార్టీల ప్రధాన అభ్యర్థుల్లో ఇద్దరు బీఆరెఎస్, బిజెపి అభ్యర్థులిద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారే కావడం విశేషం. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాత్రమే నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. అయినప్పటికీ మూడు పార్టీల అభ్యర్థులు వరంగల్ జిల్లాలోని పట్టభద్రులకు ప్రత్యేకంగా కేంద్రకరించి వారి ఓటును పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ ఖమ్మం వరంగల్ మూడు జిల్లాలలో వరంగల్ జిల్లా ఓటర్ తీర్పు కీలకం కానున్నది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోటీ చేస్తున్నందున వారిద్దరూ ఇక్కడి ఓటును ఎక్కువగా చీల్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా బీఆరెఎస్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బలమైన నిర్మాణం ఇప్పటికీ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది ఈ జిల్లా నుంచి ఆ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన ప్రతినిధులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన అప్పటి విద్యార్థులు ఇప్పటి ఉన్నత విద్యావంతులుగా, ఉద్యోగులుగా మారారు. వారంతా బీఆరెఎస్ వైపు మొగ్గుచూపుతే ఆ పార్టీకి అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. అయితే బీఆర్ఎస్ ముఖ్యంగా నిధుల పట్ల అనుసరించి న విధానంపై విగ్రహంతో ఉన్నారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలిచినందుకు ఆ పార్టీ అభ్యర్థులు ఏమి చేయలేదని విమర్శలు ఉన్నాయి మొన్నటికి మొన్న రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆ పార్టీ కావడం కొంత వ్యతిరేక ప్రభావం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న రాజేశ్వర్ రెడ్డి పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పట్టించుకోకుండా అర్ధాంతరంగా రాజీనామా చేశారని మండిపడ్డారు. ఇదిలావుండగా బీఆరెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాకేష్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నుంచి బీఆరెఎస్‌కు రావడం, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల టికెట్ ఆశించిన పాత వారు నిరాశతో ఉన్నారు.
సుదీర్ఘకాలం నుంచి బీఆరెఎస్ లో పనిచేస్తున్న వారిని కాదని ఇటీవల బీజేపీ నుంచి చేరిన అభ్యర్థికి టికెట్ కేటాయించడం పట్ల ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీలోని బీసీ వర్గాలు రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యావంతులకు, ఉద్యోగులకు కేంద్రమైన హన్మకొండ ప్రాంత మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఆయన అనుచరులు కూడా రాకేష్ రెడ్డి అభ్యర్థి కావడం వల్ల అసంతృప్తిగా ఉన్నారు. రాజేష్ రెడ్డి గెలిస్తే రేపు హనుమకొండలో వినయ్ భాస్కర్ పోటీగా మారే అవకాశం ఉంది. దీంతో ఆయన రాకేష్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ఓటింగ్ ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
బిజెపి కూడా ఇక్కడ కేంద్రీకరణ
బిజెపికి మూడు జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లాలోని ఎక్కువ పట్టు ఉన్నది. అభ్యర్థి కూడా ఈ జిల్లాకు చెందిన వారే. అయినప్పటికీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే అంత ప్రభావం చూపే అవకాశం లేదు. బిజెపి కూడా వరంగల్ ను కేంద్రంగా చేసుకొని ఎక్కువ ఓట్లు సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఏర్పడిన అనుకూల వాతావరణం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళిక
బీజేపి, బీఆరెఎస్ ఎన్నికల ప్రణాళికను గుర్తించిన కాంగ్రెస్ సైతం వరంగల్ జిల్లాపై ప్రత్యేకంగా కేంద్రీకరించి పనిచేస్తోంది. తీన్మార్ మల్లన్న కూడా వరంగల్ జిల్లాపై దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో కలియ తిరుగుతున్నారు. అయితే ఒక మంత్రి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో కేంద్రీకరించడం లేదని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న అభ్యర్థి పట్ల వీరికి వ్యతిరేకతా? లేక నిర్లక్ష్యమా? కారణమేదైనా తగినంత ప్రచారం చేపట్టలేదనే విమర్శలున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ బలం, ఎక్కువమంది ఎమ్మెల్యేల పట్టు తీన్మార్ మల్లన్న అందరికీ పరిచయమున్న వ్యక్తి కావడం వల్ల ఓటింగ్ తమకు అనుకూలంగా సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలో మల్లన్నకు వ్యక్తిగత ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ బలం తనకు తోడైతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు తీర్పు కీలకం కానున్నదని భావిస్తున్నారు.