Telangana Highcourt Strikes 42 % BC Petition | బీసీ రిజర్వేషన్ లపై దాఖలైన పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్ పై పిటిషన్ ను కొట్టివేసింది. పత్రిక కథనాల ఆధారంగా పిటిషన్ వేయడం సరికాదు అని హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana High Court

విధాత, హైదరాబాద్ : స్థానికి సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ..మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ అర్హతను ప్రశ్నించింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారంటూ మండిపడింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా ? నిలదీసింది. సుప్రీమ్ కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం పేపర్ క్లిప్పింగ్స్ ను బేస్ చేసుకుని పిటిషన్ వేయడం సరికాదంటూ..పిటిషన్ ను కొట్టివేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల మండలం కేశవాపూర్ కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకొండూర్ వాసి జల్లపల్లి మల్లవ్వలు ఈ పిటిషన్ వేశారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం అసెంబ్లోలో బిల్లులు ఆమోదించింది. వాటిని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. కాని కేంద్రం వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం బీసీలకు పెంచిన రిజర్వేషన్ల అమలు కోసం పత్యేక జీవో విడుదలకు కసరత్తు చేసుంది. అదే జరిగితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా రిజర్వేషన్లు 50శాతం దాటిపోతాయంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లు 50శాతం మించకుండా పరిమితి విధించారని..దాన్ని కొనసాగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అందులో ఉన్న విధంగా బీసీలకు 26శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9శాతం మొత్తం 50శాతం వరకే రిజర్వేషన్లు పరిమితం చేయాలని కోరారు. అయితే జీవోలు రాకముందే పత్రికా కథనాల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదంటూ హైకోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసింది.