బిలోలి కోర్టుకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్యేలు

సాగునీరు లేక ఎడారిగా మారుతున్న తెలంగాణ భూములను చూడలేక ... మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు

  • Publish Date - April 23, 2024 / 08:59 PM IST

*ఏళ్ళ తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ

విధాత బ్యూరో, కరీంనగర్: సాగునీరు లేక ఎడారిగా మారుతున్న తెలంగాణ భూములను చూడలేక … మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మహారాష్ట్ర లోని బిలోలి సెషన్స్ కోర్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చింతకుంట విజయ రమణ రావు, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కె.ఎస్.రత్నం హాజరయ్యారు.

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు రాకుండా అడ్డుకోవడంతో 2010లో అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం భారీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే! బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో మహారాష్ట్ర పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో మరాఠ పోలీసులు లాఠీ చార్జి చేయడమే కాకుండా, చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా మహారాష్ట్రలోని బిలోలి కోర్టుకు హాజరైన తమ వాదనను వినిపించారు.

*నాడు అంతా టిడిపిలో.. నేడు వేర్వేరు పార్టీల్లో…

బాబ్లీ కి వ్యతిరేకంగా నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో టిడిపి ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు. ఆనాటి పోరాటంలో ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, టిడిపి జిల్లా అధ్యక్షులుగా విజయరమణారావు, నాయకులుగా ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుతం గంగుల కమలాకర్, బిఆర్ఎస్ లో ఉండగా విజయరమణ రావు కాంగ్రేస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాడు ఒకే పార్టీలో ఉండి ఒకే నినాదంతో ఫైట్ చేసిన ఎమ్మెల్యేలు నేడు వెర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కోర్టులో కలుసుకుని పాత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.

Latest News