విధాత, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్‌రావులకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కేసీఆర్ కు నోటీసులు జారీతో ఈ కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే సిట్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. అలాగే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని, మాజీ ఇంటలిజెన్స్ అధికారి అనిల్ కుమార్ ను కూడా ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపైన, ట్యాపింగ్ కు ఎంపిక చేసిన ఫోన్ నంబర్ల అంశంపైన ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారన్నదానిపై సిట్ ఆరా తీసింది.
ప్రహసనంగా మారిన సిట్ లు : హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాష్ట్రంలో సిట్‌లు ప్రహసనంగా మారాయి. నాకు నోటీసు ఇస్తారట. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అని హరీష్ రావు వెల్లడించారు. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని.. సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు.
ప్రమోషన్ల కోసం ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎక్కువ చేస్తున్నారని, వాళ్లను హెచ్చరిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఏమైందో తెలుసుకోండి అని, మేము అధికారంలోకి రాగానే అలాంటి అధికారుల్ని వదిలిపెట్టబోమన్నారు. పోస్టింగ్స్ కోసం ఉద్దేశపూర్వకంగా కేసులు పెడితే.. మేము వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. కేసులు నాకేం కొత్త కాదు.. తెలంగాణ ఉద్యమం సమయంలోనే నా మీద 350 కేసులు నమోదయ్యాయన్నారు. పాపాత్ముడైన రేవంత్ రెడ్డిని క్షమించమని దేవుడిని కోరినందుకే.. నాపై ముఖ్యమంత్రి ఒక కేసు పెట్టాడు అని, ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉస్సాహంతో పని పని చేస్తాం.. అక్రమ అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. డీజీపీకి రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రక్షణ కల్పించడమే సరిపోయింది తప్ప.. ప్రజలను పట్టించుకోవట్లేదు అని విమర్శించారు. సంగారెడ్డిలో ఒక దళిత కుటుంబంపై దాడి చేస్తే.. తెలంగాణ డీజీపీ పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.
వారికి నోటీస్ ల జారీని స్వాగతిస్తున్నా : కేంద్ర మంత్రి బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వాలన్న సిట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తనతో పాటు ఎందరో నేతల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా, అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. “కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించారని, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు” అని మండిపడ్డారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు, నేతల నుంచి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా, లేక దోషులను తేలుస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. “ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పుడు ప్రారంభమైన టీవీ సీరియళ్లు కూడా పూర్తయ్యాయి కానీ, ఈ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అని ఎద్దేవా చేశారు. విచారణ అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులను బయటపెట్టాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి :
Medaram : మేడారం జాతర నాటికి పనులు పూర్తి
KTR : దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టండి
