హైదరాబాద్: తెలంగాణలో యువతకు ఉద్యోగావకాశాలు దొరకకపోవడం రాష్ట్ర భవిష్యత్తుకు సవాలుగా మారుతోంది. కేంద్రం తాజాగా విడుదల చేసిన PLFR రిపోర్టు (ఏప్రిల్–జూన్ 2025 క్వార్టర్) ప్రకారం, రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒక యువత నిరుద్యోగిగా ఉన్నారు. అంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువత 20.1%కు చేరుకుంది. ఇది జాతీయ సగటు 14.6% కంటే ఎక్కువ.
పట్టణ మహిళలల్లో అధిక నిరుద్యోగం
ఈనివేదికలో ముఖ్యంగా పట్టణ మహిళల్లో నిరుద్యోగం అత్యంత ఆందోళనకర స్థాయికి చేరిందని స్పష్టమైంది.
- పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగిత 28.6%గా ఉండగా, పురుషుల నిరుద్యోగిత 19.2%గా ఉంది.
- గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగిత 16% ఉండగా, పురుషులది 19.4%గా నమోదైంది.
ఈ గణాంకాలు స్పష్టంగా లింగ అసమానత(Gender Disparity)ను, అలాగే ఉద్యోగ విధానాల్లో మహిళలకు తగిన అవకాశాలు రాకపోవడాన్నిసూచిస్తున్నాయి.
మొత్తం నిరుద్యోగం – జాతీయ సగటు కంటే ఎక్కువ
రాష్ట్రంలోని 15 ఏళ్లు పైబడిన వయసు గల యువతలో నిరుద్యోగిత 6.9%గా ఉంది. ఇది జాతీయ సగటు 5.4% కంటే ఎక్కువ.
- పురుషుల్లో ఇది 7%గా ఉండగా,
- మహిళల్లో 12% దాటింది.
ఇది రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యలకు మరో సూచిక.
మహిళల పని లో భాగస్వామ్యం తక్కువ
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (LFPR) ద్వారా కూడా ఈ సమస్య స్పష్టమవుతోంది.
- 15–29 ఏళ్ల వయసు గల మహిళల్లో కేవలం 27.2% మాత్రమే ఉద్యోగ రంగంలో ఉన్నారు.
- అదే వయసులో పురుషుల్లో 60.4% మంది ఉద్యోగులుగా ఉన్నారు.
అన్ని వయసుల మహిళల్లో LFPR 41.6% మాత్రమే ఉండగా, పురుషుల్లో అది 76.1%గా ఉంది. ఈ భారీతేడా తెలంగాణలో ఉద్యోగ అవకాశాల పంపిణీలో లింగ అసమానతను రుజువు చేస్తోంది.
రంగాల వారీగా ఉద్యోగ పరిస్థితి
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విభిన్నంగా ఉన్నప్పటికీ యువతకు సముచిత అవకాశాలు లభించడం లేదు.
- 32.9% మంది వ్యవసాయ రంగంలో,
- 29.1% మంది మాన్యుఫాక్చరింగ్, నిర్మాణం, మైనింగ్ రంగాల్లో,
- 38% మంది సర్వీసుల రంగంలో పనిచేస్తున్నారు.
అయితే, సర్వీసుల రంగం (Services Sector) బలంగా ఎదిగినా, పట్టభద్రులైన యువతకు సరిపడా ఉద్యోగాలను ఇవ్వలేకపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల హెచ్చరిక
నిపుణుల అంచనా ప్రకారం, రాష్ట్రంలో ప్రతి 100 యువతలో దాదాపు 20 మంది నిరుద్యోగులుగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్ధికి ఇదిపెద్ద సమస్యగా మారనుంది.
- యువతకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడం ఆర్థిక వృద్ధిని తగ్గించడమే కాకుండా సామాజిక సమస్యలను కూడా పెంచుతుంది.
- రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వలసలు, మానసిక ఒత్తిడి, సామాజిక అసమానత వంటి సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
విధాన వైఫల్యాలపై ప్రశ్నలు
ఒకప్పుడు పెట్టుబడుల హబ్‌గా, పరిశ్రమాభివృద్ధికి కేంద్రంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు ఉద్యోగ సృష్టి విషయంలో వెనుకబడిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
- యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్టార్ట్అప్ ప్రోత్సాహాలు ఉన్నప్పటికీ, అవి సరైన స్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ప్రత్యేకించి మహిళలకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి.
పరిష్కారాలు – నిపుణుల సూచనలు
ఈ సమస్యను అరికట్టేందుకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు:
- ఉద్యోగ సృష్టి లక్ష్యం : పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా ప్రత్యేక ఉద్యోగ ప్రణాళికలు రూపొందించాలి.
- నైపుణ్యాభివృద్ధి (Skill Development): కొత్త పరిశ్రమల అవసరాలకు సరిపోయేలా యువతకు శిక్షణ ఇవ్వాలి.
- మహిళల కోసం ప్రత్యేక విధానాలు: వర్క్ ఫ్రం హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్, చైల్డ్‌కేర్ సపోర్ట్ వంటి విధానాలను అమలు చేయాలి.
- యువతకు ప్రోత్సాహం: యువత స్టార్ట్‌అప్‌లు, స్వయం ఉపాధి అవకాశాలకు మద్దతు ఇవ్వాలి.
- సర్వీసుల రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు: IT, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలి.
తెలంగాణలో యువ నిరుద్యోగిత 20% దాటటం చిన్న విషయం కాదు. రాష్ట్రం వృద్ధి సాధించాలంటే, యువతకు తగినన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ యువబలం, యువ సమస్యగా మారి, ఆర్థిక, సామాజిక ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.