Telugu Film Industry | రేపు తెలుగు సినిమా షూటింగ్​లు బంద్​

రామోజీరావు అస్తమయం పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగాగా రేపు తెలుగు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు

  • Publish Date - June 8, 2024 / 06:18 PM IST

రామోజీరావు అస్తమయం పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగాగా రేపు తెలుగు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. నేడు తెల్లవారుఝామున మరణించిన ఉషాకిరణ్​ మూవీస్(Ushakiron Movies), మయూరి ఫిలింస్​​(Mayuri Films) అధినేత రామోజీరావు(Ramoji Rao) అంత్యక్రియలు(Last Rites) రేపు ఉదయం తెలంగాణ ప్రభుత్వపు అధికార లాంఛనాల(State Honour)తో జరగనున్నాయి. ఆయన పార్థివదేహానికి ప్రజలు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

ఉషాకిరణ్ మూవీస్‌తో సినీ పరిశ్రమపైన రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సినిమాలు నిర్మించ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి. తెలుగు, కన్నడ, హింది సహా పలు భాషల్లో 80కిపైగా మంచి సినిమాలను నిర్మించారు. ఎందరో హీరోలను, దర్శకులు, సంగీత దర్శకులను తెలుగు సినీరంగానికి పరిచయం చేశారు. విజయ్​ దేవరకొండ(Vijay Devarakonda), యామీ గౌతమ్(Yami Gautam)​, కీరవాణి, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియశరణ్, అథ్లెట్​ అశ్వనీ నాచప్ప, సుధాచంద్రన్​​ మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే.

 

రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’ చిత్రాలు 1999లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచాయి. నువ్వేకావాలి(Nuvve kavali)కి జాతీయ అవార్డు రాగా మరి కొన్ని సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. తెలుగు సూపర్​స్టార్​ జూనియర్ ఎన్టీఆర్​(Jr. NTR)ను కూడా నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో నిర్మాతగా మారిన రామోజీరావు అనేక చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. వాటిలో కామెడీ కథలు, అందమైన ప్రేమ కథలు, కుటుంబ కథలు, ప్రజాసమస్యలు, పిల్లల కథలు, సామాజిక ఇతివృత్తాలపై తీసిన సినిమాల వరకు ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించు పెళ్లాడు వంటి కామెడీలు, పీపుల్స్ ఎన్‌కౌంటర్ వంటి విప్లవాత్మక సినిమాలు, మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి వంటి లేడి ఒరియెంటెడ్ చిత్రాలు, కాంచనగంగ, ఓ భార్య కథ, మనసు మమత, అమ్మ, దీవించండి లాంటి కుటుంబకథా చిత్రాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Latest News