Ramoji Rao | ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు.. పాడె మోసిన చంద్రబాబు

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు

  • Publish Date - June 9, 2024 / 12:07 PM IST

హాజరైన వివిధ రంగాల ప్రముఖులు

విధాత: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. రామోజీ గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.

రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానులు ‘జోహార్ రామోజీరావు అంటూ చేసిన నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని రామోజీకి నివాళుర్పించి పాడే మోశారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు.

రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మనుమడు సుజయ్ రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతకుముందు ఫిలింసిటీలో రామోజీ గ్రూపు కార్యాలయాల మీదుగా కొనసాగిన అంతిమయాత్రలో అభిమానులు, ప్రముఖులు రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామోజీరావు అంతిమ సంస్కారాల్లో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.

ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు నారా లోకేశ్‌తో ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ వెనిగండ్ల రాము, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, సాయిప్రసాద్, ఆర్పీ సిసోడియాలు హాజరయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరరావు, వి. హనుమంతరావు, కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము, సినీ ప్రముఖులు బోయపాటి శ్రీను, సురేశ్‌బాబులు పాల్గొన్నారు.

Latest News