1:50 నిష్పత్తిలోనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. స్పష్టం చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా చేస్తున్న ఆందోళనలను పట్టించుకోని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది.

  • Publish Date - July 4, 2024 / 03:10 PM IST

రేపు చలో టీజీపీఎస్సీ ముట్టడి

విధాత : గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా చేస్తున్న ఆందోళనలను పట్టించుకోని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. గ్రూప్-1 మెయిన్స్ లో ఏడు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ పేపర్) – అక్టోబర్ 21న, పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22న, పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23న, పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24న, పేపర్ -IV (ఎకానమీ, డెవలప్‌మెంట్) – అక్టోబర్ 25న, పేపర్- V (సైన్స్&సాంకేతికత, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ) – అక్టోబ్ 26న, పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27న నిర్వహించనున్నారు.

గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్‌ 9న పిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో మొత్తం 7 పేపర్లు ఉండనున్నాయి. ఇంగ్లిష్‌ క్వాలిఫయింగ్‌ పేపర్‌ కావడంతో పదో తరగతి స్టాండర్డ్‌లో నిర్వహించనున్నారు. ఈ మార్కులను మెయిన్స్‌ మొత్తం మార్కులలో కలుపరు.

రేపు చలో టీజీపీఎస్సీ

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు చేయాలని, గ్రూప్‌ 2, 3, డీఎస్సీలో పోస్టులను పెంచాలని, ఏటా రెండులక్షల ఉద్యోగ భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న డిమాండ్లతో నిరుద్యోగ జేఏసీ రేపు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధనకు కొన్ని రోజులుగా ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు ప్రభుత్వానికి గడువునిచ్చారు. నిరుద్యోగుల ఆందోళనకు బీఆరెస్ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

Latest News