50శాతం సీలింగ్ ప్రధాన అడ్డంకి
ఎస్సీ వర్గీకరణనే ఇందుకు ఉదాహరణ
తెలంగాణ సర్కార్ బీసీ సెంటిమెంట్ రాజకీయం
స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం కింకర్తవ్యం
సుప్రీంకోర్టులో చాలెంజ్ చేస్తారా?
BC Reservations | హైదరాబాద్, విధాత : బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సీలింగ్ పెట్టడం మూలంగానే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకులు ఎదురవుతున్నాయని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్డంకి కారణంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9 ను అమలుపర్చకుండా హైకోర్టు ఆరు వారాలు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. 50 శాతం సీలింగ్‌తోనే రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవడం లేదనేది అర్థమవుతున్నది. కోర్టులు కూడా తీర్పులు ఇచ్చి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడలేవు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూలులో చేర్చితేనే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని, సంపూర్ణ రక్షణ లభిస్తుందని పలువురు న్యాయ నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీలలో రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిందని, కేంద్ర ప్రభుత్వం సమ్మతితోనే ఈ తీర్పు వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమ్మతిస్తేనే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమవుతుందని సుస్పష్టమవుతున్నది. అసలు విషయం వదిలేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి, ఆర్డినెన్స్‌లు జారీ చేసి, జీఓ ఇచ్చిందంటున్నారు. ఇవన్నీ ఆ వర్గాల్లో సెంటిమెంట్ రాజేసేందుకు తప్ప రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబించవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ హైకోర్టు గురువారం నాడు స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక ఎన్నికలు మొదటికి వచ్చాయంటున్నారు.
హైకోర్టు స్టే పై తర్జనభర్జన
హైకోర్టు ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టు వెళ్లి ఛాలెంజ్ చేయాలా, ఒక వేళ చేస్తే ఎలా సమర్థించుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్టే కాపీ అందిన తరువాత అధ్యయనం చేసి ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర మంత్రులు గురువారం నాడు తెలిపారు. అడ్వకేట్ జనరల్, రాజ్యాంగ నిపుణులతో ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం మరింత బద్నాం కావడంతో పాటు ప్రజల్లో పలుచన అవుతామనే భయం ఉంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించనట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు నిలిచిపోతాయి. ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా నిధులు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో నిజామాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి 3 గంటలకు నగరానికి చేరుకున్నారు. పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ విషయమై సంబంధిత మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చించారా లేదా అనేది తెలియడం లేదు. ప్రభుత్వ అనుసరించే వ్యూహం పై మంత్రులు కూడా నోరు మెదపడం లేదు.
తమిళనాడులో 1927లోనే రిజర్వేషన్లు
తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపునకు పటిష్టమైన వ్యూహాన్ని అక్కడి ప్రభుత్వాలు అమలు చేయడం మూలంగానే సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు 30 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు 20 శాతం, షెడ్యూల్డు కులాలు 18 శాతం షెడ్యూల్డ్ తెగలు 1 కలిపితే మొత్తం 69 శాతం అవుతున్నది. 1971 నాటికే అప్పటి డీఎంకే ప్రభుత్వం రిజర్వేషన్లను 49 శాతానికి పెంచుకున్నది. 1980 లో ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 31 శాతం నుంచి 40 శాతానికి పెంపుదల చేశారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం లభించింది. మళ్లీ 1989 లో డీఎంకే ప్రభుత్వం ఎస్టీలకు 1 శాతం పెంచింది. అయితే 1992లో ఇందిరా సాహ్నీ-యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు దాటరాదని తీర్పునిచ్చింది. అప్పటికే తమిళనాడులో 69 శాతం అమలవుతోంది. వీటిని యథావిధిగా కొనసాగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కుమారి జయలలిత వ్యూహాత్మంగా వ్యవహరించారు. 1994లో రాష్ట్ర శాసన సభలో చట్టం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజ్యాంగంలో 9వ షెడ్యూలులో చేర్పించారు. ఈ షెడ్యూల్ లో చేర్చితే న్యాయస్థానాలు సమీక్షించే అవకాశం ఉండదు. 1991లో అన్నా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయి. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు, అన్నా డీఎంకే ఎంపీల బలంపై ఆధారపడి ఉన్నారు. దీంతో ఆయన జయలలిత వినతిని అంగీకరించక తప్పలేదు. దేశానికి స్వాతంత్ర్య రాక మునుపే 1927లో జస్టిస్ పార్టీ అధికారంలో ఉండగా 100 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రద్ధు చేయగా, భారీ నిరసనలు, అల్లర్ల కారణంగా 1951లో రాజ్యాంగానికి మొదటి సవరణ చేసి రాష్ట్రాలకు రిజర్వేషన్ హక్కులు ఇచ్చారు.
బీహార్ నుంచి నేర్చుకోరా?
బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం 19 రకాల సమాచారంతో కుల గణన నిర్వహించింది. ఈ కుల గణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రుణ పథకాలను కూడా ప్రకటించింది. దీనిపై పలువురు పాట్నా హైకోర్టు లో పిటీషన్ వేయడంతో విచారించిన తరువాత రిజర్వేషన్ పెంపును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, విచారణ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో జరిగిన బీహార్ కుల గణన, తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటున్నారు. రాష్ట్రంలోని పలు పార్టీల నాయకులు, న్యాయ నిపుణులు రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో అంశం కాదని చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఇవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్లిందంటున్నారు.
అసలు విషయం వదిలేసిన రేవంత్ రెడ్డి
రాష్ట్రాలలో అమలవుతున్న రిజర్వేషన్లు, స్థానిక పరిస్థితులు, తమిళనాడు రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన ఉన్నప్పటికీ శాస్త్రీయంగా అడుగులు వేయలేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూలులో చేర్చిన తరువాతే తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లకు రక్షణ లభించిందంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాని.. కేంద్రంలోని ప్రభుత్వం ఇక్కడి ఎంపీల మద్ధతుతో మనుగడలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. దశాబ్ధాలుగా ఉద్యమిస్తే తప్ప మాదిగలకు ఉపవర్గీకరణ ఫలాలు అందలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సభలో ప్రభుత్వం తరఫున ఎస్సీలలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా తీర్పు రావడం, తెలంగాణ తో పాటు ఏపీలో వర్గీకరణ చట్టపరంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి బీహార్ ప్రభుత్వానికి తగిలిన ఎదురు దెబ్బలు, పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ లు జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలతో అంతగా అవసరం లేదు.