ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ.. హాట్ హాట్‌గా ఖమ్మం ఎన్నికల ప్రచారం

  • Publish Date - November 7, 2023 / 09:16 AM IST

విధాత : ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి, బీఆరెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావుల మధ్య ఎన్నికల ప్రచారం వాడీవేడి విమర్శలతో, ఆరోపణలతో హాట్‌హాట్‌గా సాగుతున్నది. తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రతీ రోజు రోడ్‌ షోలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ పాలనపై విరుచుకుపడుతున్నారు. మంగళవారం 44వ డివిజన్‌లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీతో తుమ్మల రోడ్‌షో నిర్వహించారు.


ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఖమ్మంలో అధికార పార్టీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మహిళలే రథసారధులన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మహిళలు కథం తొక్కాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో అరాచక ప్రభుత్వం, పోలీస్ రాజ్యం తరమికొట్టాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వెళ్లోద్దని మహిళలను బెదిరిస్తున్నారని, అధికారంతో బెదిరించే వారిని మహిళలే చెప్పుతో కొడతారన్నారు.


ఉద్యోగస్తులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ దొంగ ఒట్లను నమోదు చేయించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు అవినీతి రాజ్యంపై ఖమ్మం రగిలిపోతుందన్నారు. కాంగ్రెస్ పాలనతోనే ఖమ్మంలో ప్రశాంత ఖమ్మం రాబోతోందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంతకుముందు తుమ్మల మంత్రి పువ్వాడకు చెందిన మమతా కళాశాల విద్యార్థుల ఓట్ల నమోదుపైన, ఇంటి నెంబర్ లేకుండా జరిగిన ఓట్ల నమోదుపైన ఈసీకి ఫిర్యాదు చేశారు.


తుమ్మలపై పువ్వాడ ఫైర్‌


ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పువ్వాడ ప్రత్యర్థి తుమ్మలపై పదునైన విమర్శలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం లో దొంగ ఓట్లు ఉన్నాయని తుమ్మల ఈసీకి ఫిర్యాదు చేయడం హాస్యస్పదమన్నారు. తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు లేదంటే దొంగ ఓటా అని ప్రశ్నించారు. మమతా కాలేజీ విద్యార్థులపై తుమ్మల కక్షపూరితంగా ఈసీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో తుమ్మల ఈ స్థాయికి దిగజారటం సిగ్గుచేటు అన్నారు.


18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటుకు అర్హులేనని, మమత కళాశాల విద్యార్థులు కూడా తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్నారు. గతంలో తన మంత్రి పదవికి అడ్డుగా వస్తున్నానని నన్నూ తుమ్మల ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. తుమ్మల ఆయనకు రాజకీయ బిక్షపెట్టిన ఎన్టీఆర్‌ను, చేశాడు రాజకీయంగా ఆదుకున్న చంద్రబాబు, కేసీఆర్‌లనును కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.

Latest News