తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి రంగం సిద్ధం, 6న హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి…చంద్రబాబుల సమావేశం

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల హైదరాబాద్‌లో జరుగనుండగా, ఈ భేటీకి ఒకవైపు రాష్ట్ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, ఇంకోవైపు రాజకీయ రచ్చకు ఈ భేటీ వేదికవుతుంది

  • Publish Date - July 2, 2024 / 06:05 PM IST

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి రంగం సిద్ధం
6న హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి…చంద్రబాబుల సమావేశం
విభజన సమస్యల పరిష్కారంపై ఆశలు
భేటీపై అనుమానాలు వ్యక్తం చేసిన బీఆరెస్‌
గురుదక్షిణగా తెలంగాణ పరిశ్రమలంటూ ఆరోపణలు
ఏడు మండలాల సంగతి తేల్చాలన్న హరీశ్‌రావు
భేటీని స్వాగతించిన కోదండరామ్‌
విలీన పంచాయతీలను రాబట్టాలని మంత్రి తుమ్మల లేఖ

విధాత : హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల హైదరాబాద్‌లో జరుగనుండగా, ఈ భేటీకి ఒకవైపు రాష్ట్ర యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, ఇంకోవైపు రాజకీయ రచ్చకు ఈ భేటీ వేదికవుతుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల జరుగాల్సిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చించాల్సిన ఎజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలే ఎజెండా

సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుల భేటీలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలే ప్రధాన ఎజెండా కాబోతున్నాయి. పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పెండింగ్‌లో ఉన్నాయి. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో.. రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ళు తరబడి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావొచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

ఆసక్తి రేపిన మంత్రి తుమ్మల లేఖ

తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా భద్రాచలం విలీన గ్రామపంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేఖలో సీఎం రేవంత్‌రెడ్డిని తుమ్మల కోరారు. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం. కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణం మినహా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం ఆనుకుని ఉన్న ఆ ఐదు పంచాయతీల ప్రజలు భౌగోళికంగా, రవాణా పరంగా, పాలన పరంగా తెలంగాణ ప్రాంత గ్రామాలతో ముడిపడివున్న నేపథ్యంలో వారు తిరిగి తమ పంచాయతీలను తెలంగాణ కలపాలని తీర్మానాలు చేశారు. ప్రజల కోరిక మేరకు ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేలా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్‌ఆండ్‌బీ శాఖ పరిధిలోని భవనాల స్థితిగతులపై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఆండ్‌బీ పరిధిలోని ఆస్తుల వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లేక్ వ్యూ, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలపై మంత్రి చర్చించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లపై వెంకట్ రెడ్డి అధికారులతో చర్చించారు.హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి స్వాధీనం చేసుకున్న భవనాలను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తామని వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

సీఎంల భేటీపై బీఆరెస్ రచ్చ

ఈనెల 6న హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంల భేటీపై బీఆరెస్ పార్టీ పలు అనుమానాలతో రాజకీయ రచ్చ రేపుతుంది. ట్విటర్ వేదికగా విమర్శల దాడి సాగిస్తుంది. తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్ పెట్టిందని బీఆరెస్‌ ఆరోపించింది. ‘ఇదన్నమాట వీళ్ళ భేటీ వెనుక అసలు రహస్యం! తెలంగాణ పరిశ్రమలపై ఏపీ నజర్ అని.. వాటిని అప్పజెప్పేందుకు గురు శిష్యుల భేటీ అని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనున్న రేవంత్ గురుదక్షిణ’ అంటూ తీవ్ర ఆరోపణలు సంధించింది. అటు మాజీ మంత్రి టి.హరీశ్‌రావు సీఎం భేటీపై స్పందిస్తూ చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌నుకోవ‌డం సంతోషమని, అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తొలిరోజుల్లో ఏడు మండలాల‌ను, లోయ‌ర్ సీలేరు ప‌వ‌ర్ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో క‌లిపారని, దీంతో తెలంగాణ రాష్ట్రం ఎంత‌గానో న‌ష్ట‌పోయిందన్నారు. ఏడు మండ‌లాల‌ను తిరిగి ఇవ్వాల‌నేది సీఎంల సమావేశంలో మొద‌టి ఎజెండాగా పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబుపై ఎన్డీఏ ప్ర‌భుత్వం ఆధార‌ప‌డి ఉందని, కాబ‌ట్టి రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు మీద ఒత్తిడి తెచ్చి ఏడు మండ‌లాలు, లోయ‌ర్ సీలేరు ప‌వ‌ర్ ప్రాజెక్టు తెలంగాణ‌కు వ‌చ్చేలా కృషి చేయాల‌ని కోరుతున్నామన్నారు. ఏడు మండ‌లాలు వ‌చ్చిన త‌ర్వాత‌నే విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ముందుకు పోవాలని, వారు పోల‌వ‌రం క‌ట్టుకుంటే అభ్యంత‌రం లేదని, భ‌ద్రాచ‌లం వ‌చ్చే భ‌క్తుల వాహ‌నాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థ‌లం లేకుండా పోయిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆ ఏడు మండ‌లాల ప్ర‌జ‌లు తెలంగాణ‌తో ఉండాల‌ని కోరుకుంటున్నారని తెలిపారు.

స్వాగతించిన కోదండరామ్‌

రాష్ట్ర విజభ సమస్యలపై ఈనెల 6న హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానుండటాన్ని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం స్వాగతించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీని స్వాగతిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుర్చొని చర్చించడం వలన విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖాముఖీ మాట్లాడుకుంటే పదేళ్ల సమస్యలు పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కూర్చొని కలిసి భోజనం చేశారు కానీ రాష్ట్ర విభజన అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించలేదని సెటైర్ వేశారు.

 

Latest News