విధాత : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. కీలక నేతలు లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లతో పార్టీ ఉనికి సవాల్ గా మారింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు పార్టీ కీలక నేతలు ముగ్గురు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు సిద్దిపేట జిల్లా కుంకటి వెంకటయ్య అలియాస్ రమేష్, వికాస్, చత్తీస్ గఢ్ కు చెందిన తోడెం గంగ అలియాస్ సోనీలు మొగిలిచర్ల చందు అలియాస్ వెంకటరాజు, లొంగిపోయారు. వారికి సంబంధించిన నగదు రివార్డులను డీజీపీ అందచేశారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూజీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై.. అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు. పీడబ్ల్యూజీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని.. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45) తన 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు అతని భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు అని తెలిపారు. మావోయిస్టులు విప్లవోద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.