Site icon vidhaatha

షాద్‌నగర్‌ పరిశ్రమలో భారీ పేలుడు ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన షాద్‌నగర్‌లోని ఒక పరిశ్రమలో శుక్రవారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. దీంతో పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. కనీసం పదిహేను మంది గాయపడ్డారని తెలుస్తున్నది. షాద్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
సౌత్‌గ్లాస్‌ కంపెనీలో కంప్రెషర్‌ గ్లాస్‌ పగిలిపోవడంతో ఈ పేలుడు జరిగినట్టు భావిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని అంబులెన్సుల్లో సమీప ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయని, కాళ్లు, చేతులు తెగిపడ్డాయని స్థానికులు తెలిపారు. పేలుడు ప్రాంతం భీతావహంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్మికులు రోజువారీ తనిఖీల్లో ఉండగా ఫర్నేస్‌లో పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు. పేలుడు సంభవించిన సమయంలో ఆ పరిశ్రమలో 30 మంది ఉన్నట్టు తెలుస్తున్నది. చనిపోయినవారు ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందనివారని తెలుస్తున్నది. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ దవాఖానలకు తరలిస్తామని అధికారులు అంటున్నారు.
ఇదే షాద్‌నగర్‌లో గతేడాది జూలై 18న బ్లెండ్‌ కలర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో మంటలు చెలరేగడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

Exit mobile version