TPCC | త్యాగాలను గుర్తించేందుకే అధికారిక చిహ్నంలో అమరుల స్థూపం

తెలంగాణ కోసం చనిపోయిన అమరుల త్యాగాలను గుర్తించేందుకే అధికారిక చిహ్నంలో అమర వీరుల స్థూపం పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటుందని, చరిత్ర తెలియని వాళ్ళు పాలనకు అనర్హులని, సీఎం రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు

  • Publish Date - May 31, 2024 / 06:28 PM IST

 

విధాత : తెలంగాణ కోసం చనిపోయిన అమరుల త్యాగాలను గుర్తించేందుకే అధికారిక చిహ్నంలో అమర వీరుల స్థూపం పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటుందని, చరిత్ర తెలియని వాళ్ళు పాలనకు అనర్హులని, సీఎం రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాదని, ప్రభుత్వం కార్యక్రమాలన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలిసిన సమయం ఇదన్నారు. 2023ఎన్నికల కంటే ముందుగు పీసీసీగా ఒక అజెండా ప్రజల ముందు రేవంత్ ఉంచారన్నారు. రాచరిక పాలన తీసి ప్రజా పాలన తీసుకోస్తామన్నారని, అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తామన్నారు. ప్రజా పాలనలో భాగంగానే జయ జయ హే తెలంగాణా పాటని అధికారిక గీతం చెయ్యటం జరిగిందన్నారు. ప్రభుత్వం అంటేనే చిహ్నం … అది ముఖ్యమైన ప్రజా చిహ్నం అమరవీరుల త్యాగమని స్పష్టం చేశారు.
టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమకారులను, తెలంగాణ గేయాన్ని పట్టించుకోకుండా అవమానిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాకళాకారుల, ఉద్యమకారుల ఆలోచన మేరకు అందేశ్రీ పాటను తెలంగాణ అధికారిక గేయంగా చేసి, అమరుల త్యాగాలను గుర్తిస్తుంటే దేశపతి శ్రీనివాస్, వి.ప్రకాష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చిహ్నం మార్పులపై బీఆరెస్ నేతలు వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. నేను 1996 నుండి ఉద్యమంలో ఉన్నప్పుడు వీళ్లెవరూ కనిపించలేదని, వీళ్లు తెలంగాణ వచ్చాక కేసీఆర్ దగ్గర చేరారని, చరిత్రలో నిలిచిపోయే స్థాయికి తీసుకుపోయే విధంగా పేరున్న వారితో రాష్ట్ర గేయాన్ని రూపొందించాలని భావించామన్నారు.

అందే శ్రీ కాల్ రికార్డింగ్స్ విడుదల చేయడం దిగజారుడు కుట్ర రాజకీయమన్నారు. దేశపతి లాంటి వాళ్ల మాటలు, కేటీఆర్ ధర్నాలు చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందన్నారు. కేటీఆర్‌ అమెరికాలో పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ, మా నాన్న మీద కుట్ర పన్నుతున్నారని ఉద్యమ సమయంలో మాట్లాడినాడని, ఇప్పుడు తెలంగాణ ప్రైడ్ దెబ్బతిన్నదంటున్నారని, మీరు రాష్ట్ర చిహ్నంలో ఎవరిని అడిగి చార్మినార్, కాకతీయుల తోరణం పెట్టారని ప్రశ్నించారు. పెళ్ళాం మొగుడు మాట్లాడుకునే సంభాషణలు రికార్డ్ చేసిన నీచుడు కేటీఆర్‌ ఇవాళ నీతులు చెప్తున్నాడని మండిపడ్డారు. కాకతీయుల రాజుల తోరణం..నవాబుల చార్మినార్ కావాలంటున్న మీరు అమరవీరుల స్థూపం ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు టీజీ అని రాసుకుంటే, టీఆరెస్‌ను గుర్తు చేసేలా అధికారంలోకి రాగానే టీఎస్‌ అని పెట్టుకున్నారని విమర్శించారు. అందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. ప్రజల తీర్పును కూడా కాదని తెలంగాణ ప్రజలు తప్పు చేశారంటూ కేసీఆర్‌,కేటీఆర్‌లు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సమ్మక్క సారక్కలను చంపింది ఎవరని, కాకతీయ రాజులే కదా అని, గిరిజనుడైన నేను, 12శాతం గిరిజనులు కాకతీయ కళాతోరణం ఎందుకు ఆమోదించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామిక మార్గంలో చేస్తున్న పనుల్లో బీఆరెస్ నేతలు అడ్డం పడుతూ కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు

Latest News