Telangana | రాష్ట్రంలోని ప‌ది యూనివ‌ర్సిటీల‌కు ఇంచార్జీ వీసీలు నియామ‌కం

రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంచార్జీ వీసీల‌ను నియ‌మించింది

  • Publish Date - May 21, 2024 / 03:50 PM IST

హైద‌రాబాద్: రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంచార్జీ వీసీల‌ను నియ‌మించింది. ప‌ది యూనివ‌ర్సిటీల‌కు ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను ఇంచార్జీ వీసీలుగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయి వీసీల‌ను నియ‌మించే వ‌ర‌కు వీరు ఆ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌నున్నారు.

వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే, ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ క‌మిటీని ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి.

ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్‌ విశ్వవిద్యాలయాల వీసీలుగా పని చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతారు. వీసీల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు సిట్టింగ్‌ వీసీలతో పాటు కొత్త వారు కూడా మొత్తం 312 మంది ప్రొఫెసర్లు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది.

యూనివ‌ర్సిటీల ఇంచార్జీ వీసీలు వీరే..

ఉస్మానియా యూనివర్సిటీ – దాన కిషోర్
జేఎన్టీయూ – బుర్రా వెంకటేశం
కాకతీయ – వాకాటి కరుణ
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ – రిజ్వి
తెలంగాణ వర్సిటీ – సందీప్ సుల్తానియా
తెలుగు యూనివర్సిటీ – శైలజ రామయ్యర్
మహాత్మా గాంధీ – నవీన్ మిట్టల్
శాతవాహన – సురేంద్ర మోహన్
పాలమూరు – నదీం అహ్మద్
జవహ‌ర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ – జయేష్ రంజన్

Latest News