Sunstroke | ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగిలే ఛాన్స్‌..! పెరుగుతున్న ఎండలతో వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు..!

  • Publish Date - April 3, 2024 / 11:05 AM IST

unstroke | తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 41 డిగ్రీలకు చేరాయి. ఎండలకు తోడు వడగాలులు సైతం వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు మూడునెలలు ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఎండలు, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని.. ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. అయితే, వైద్య నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎండలో తిరిగడం వల్లే కాకుండా ఇంట్లో ఉన్న పలు సందర్భాల్లో వడదెబ్బ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ కీలక సూచనలు చేశారు. ఎండలో పనిచేయడం, ఆటలు ఆడడంతో పాటు చెప్పులు లేకుండా ఆరుబయట తిరగొద్దని సూచించారు. పార్క్‌ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెట్స్‌ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగంటలలోపు వంటగదికి సైతం దూరంగా ఉండడం మంచిదన్నారు. మద్యం, టీ, కాఫీ, స్వీట్స్‌, కూల్‌డ్రిక్స్‌కు సైతం దూరంగా ఉండాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉండడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు : డాక్టర్‌ రాజారావు గాంధీ ఆసుప్రతి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు సైతం ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వద్ద ఉండాలని చెప్పారు. అదే సమయంలో ఇంట్లోకి వేడిగాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇంట్లోకి వడగాల్పులు రాకుండా కర్టెన్లను వాడాలన్నారు. ఇంట్లో ఉన్న సమయంలో తరుచూగా నీరు తాగాలని.. ఉప్పు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం ద్వారా ఎలక్ట్రోలైట్స్‌ పుష్కలంగా లభించి వడదెబ్బ నుంచి కాపాడుతాయని చెప్పారు. ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీసం నాలుగు లీటర్ల వరకు నీటిని తాగాలని.. ఎండలో పని చేసేవారు మరో లీటర్‌ నీటిని అదనంగా తీసుకోవాలని సూచించారు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలని, అవి చెమటను పీల్చి శరీరం చల్లబరుస్తాయన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటలలోపు ఎండలో తిరగొద్దని.. అత్యవసరమై బయటకు వెళ్తే గొడుపు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలన్నారు. వేసవిలో ఎక్కడ పడితే అక్కడ నీరు తాగడం ఏమాత్రం సరికాదని.. బయటకు వెళ్లిన సమయంలో వెంట వాటర్‌ బాటిల్స్‌ను తీసుకెళ్లాలని చెప్పారు. తాజాగా వండిన ఆహారం తీసుకోవాలని.. బయట తినడం మానుకోవాలని తెలిపారు. వేసవిలో మద్యానికి దూరంగా ఉండాలని.. డీహైడ్రేషన్ బారినపడేలా చేస్తుందన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటిలో ఓఆర్‌ఎస్‌ కలుపుకొని తాగడం తాగాలని.. తద్వారా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చన్నారు. మధుమేహం, హై బీపీ రోగులు అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే డీహైడ్రేషన్‌తో బీపీ తగ్గి ఉంటుందన్నారు. . ఈ సమయంలో బీపీ మందులు వేసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. బీపీ రోగులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితిలో ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని డాక్టర్‌ రాజారావు సూచించారు.

Latest News