యూరియా సరఫరాలో కేంద్రం వైఫల్యం: రైతులకు తుమ్మల లేఖ

తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా కేంద్రం విఫలమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకోసం లేఖ రాశారు.

Thummala Nageshwar Rao

రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. యూరియా సరఫరా చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రం తన వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.1.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులకు గాను 1.07 లక్షల మెట్రిక్ టన్నులే తెలంగాణకు సరఫరా చేశారని ఆయన ఆ లేఖలో తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 2.58 లక్షల టన్నుల యూరియా లోటుందని ఆయన ఆ లేఖలో అన్నారు. యూరియా కొరతపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

యూరియా కోసం రాష్ట్రంలో పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. యూరియా సరఫరా చేసే ఆగ్రోస్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్రానికి అలాట్ చేసిన యూరియాను కేంద్రం సప్లయ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయమై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి రాష్ట్రానికి అలాట్ చేసిన యూరియాను సరఫరా చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా నడ్డాను కలిసి యూరియా సరఫరా చేయాలని వినతి పత్రం సమర్పించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రిపేర్ కు రావడం కూడా యూరియా కొరతకు కారణమనే అభిప్రాయాలున్నాయి.