సీతారామ వ్యయం పెరిగింది.. కానీ ఆయకట్టు మాత్రం పెరగలే
2026లో సీతారామ ప్రాజెక్టు పూర్తి
కాంగ్రెస్కు పేరు వస్తుందనే రాజీవ్, ఇందిరా సాగర్ పేర్ల మార్పిడి
కమీషన్ల కోసమే మోటర్ల బిగింపు
హైదరాబాద్: సీతారామ ప్రాజెక్ట్ పంపులను ఆగస్ట్ 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.మంగళవారం జలసౌధలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండాసురేఖ, ఎంపీ రఘురామ్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టును 2026లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
సాగునీటిపారుదల వ్యవస్థను బీఆరెస్ నాశనం చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమకున్న తక్కువ సమయంలోనే సాగునీటి పారుదల వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. బీఆరెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పదేళ్ళలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.7436 కోట్లు ఖర్చు పెట్టి నీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వం పదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు స్థానంలోనే వైఎస్సార్ హయాంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ నిర్మాణం చేపట్టామని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్‌లను సీతారామ ప్రాజెక్టు అని బీఆరెస్ నామకరణం చేసిందని ఆరోపించారు. రాజీవ్, ఇందిరా సాగర్ రూ.3500 కోట్లతో పూర్తయ్యేవని, కానీ బీఆరెస్ ప్రభుత్వం రీడిజైన్‌తో దీన్ని రూ.18 వేల కోట్లకు పెంచిందని చెప్పారు. బీఆరెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆరోపించారు. వ్యయం పెరిగినా ఆయకట్టు పెరగలేదన్నారు. రాజీవ్, ఇందిరా సాగర్‌లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిందని, బీఆరెఎస్ ప్రభుత్వం కేవలం రూ.1500 కోట్లు ఖర్చు పెడితే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. రీ డిజైనింగ్ పేరుతో సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని హరీశ్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. బీఆరెస్ హయాంలో 39 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ తామే తీసుకొచ్చామని హరీశ్ రావు చెప్తున్నారు కానీ ఇంతవరకు అది రాలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టుకు 500 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
రూ.18,231 కోట్ల ప్రాజెక్టుకు రూ.7230 కోట్లు ఖర్చు పెడితే 90 శాతం పనులు ఎలా పూర్తి అవుతాయని మాజీ మంత్రి హరీశ్ రావును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మోటర్లు బీఆరెస్ హయాంలో బిగించారన్న మంత్రి.. కమీషన్ ఎక్కువ వస్తుంది కాబట్టే ముందు మోటర్లు బిగించారని ఆరోపించారు. మోటర్లు పెట్టాక కనీసం డ్రైరన్ కూడా నిర్వహించలేదని విమర్శించారు. గత మూడు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీఆరెస్‌కు ఇచ్చింది ఒక్కటే సీటని పొంగులేటి గుర్తు చేశారు. బీఆరెస్‌కు ఇక భవిష్యత్తులో మిగిలేది పెద్ద సున్నాయేనని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా తన బొమ్మ పెట్టుకుని తన శిష్యుడే గెలిచాడని పొంగులేటి అన్నారు. బీఆరెస్‌లా గత ప్రభుత్వం చేసిన పనులను తమ ప్రభుత్వం చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదని తెలిపారు. ఖమ్మం పౌరుషం ఏంటో నీ మామను అడుగు అని హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. ఖమ్మం ప్రజలను ఎంత తక్కువ గోకితే హరీశ్‌రావుకు అంత మంచిదని హితవు పలికారు.