విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు రుణ సహాయం ఒప్పందానికి తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ తో త్వరలోనే మూసీ ప్రాజెక్టు పనులకు నిధులు విడుదల కానున్నాయని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ, ఏడిబీ బ్యాంకు విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు సమాచారం వెల్లడించాయి.
మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం ఏడీబీ బ్యాంకు, తెలంగాణా ప్రభుత్వాల మధ్య రూ.4100 కోట్ల రుణ ఒప్పందానికి కేంద్రం అనుమతించిందని తెలుస్తుంది. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకు కేంద్రానికి మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై లేఖ రాశారు. ఏడీబీ సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణం తీసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి మద్దతునివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు హైదరాబాద్ లో పర్యటించిన ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు మూసీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. మూసీ ప్రాజెక్టుపై ఏడీబీ సానుకూలంగా ఉండటంతో.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ముందుగా రుణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సాంకేతిక అంశాల అధ్యయనం అనంతరం మూడు నెలల క్రితం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదంతో మరింత పురోగతి లభించింది. రుణ ఒప్పందానికి సంబంధించి ఏడీబీ, తెలంగాణా పురపాలక శాఖ అధికారుల మధ్య పలుమార్లు చర్చలు కొనసాగాయి.
జులై నెలలో ఏడీబీ, తెలంగాణా ప్రభుత్వ పురపాలక శాఖ మధ్య రుణ ఒప్పందం కుదిరింది. ఒప్పందం వివరాలను తెలియజేస్తూ అధికారిక ధ్రువీకరణ కోసం గత నెలలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కు షియన్ డెవలమ్ మెంట్ బ్యాంక్ లేఖ రాసింది. దీనిపై ఆమోదం తెలుపుతూ రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఏడీబీకి సమాచారం ఇచ్చింది. రుణ ఒప్పందానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు తాజాగా ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు దశల వారీగా రుణ సహాయం మంజూరు కానుంది.
హైదరాబాద్ నగర శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.1500 కోట్లలో ప్రస్తుతానికి రూ.375 కోట్ల నిధులు మంజూరు చేసింది. నది పరివాహక ప్రాంతాల్లోని అనధికారిక నిర్మాణాలను తొలగించి, నదిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునరుజ్జీవం పథకానికి గండిపేట వద్ద శంకుస్థాపన చేశారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III) పనులను ప్రారంభించారు. గోదావరి నది నుంచి 20 టీఎంసీల నీటిని తరలించడం ప్రధానం కాగా, అందులో జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 17.50 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను నింపడం, మరో 2.50 టీఎంసీల జలాలను మూసీ నది పునరుజ్జీవనానికి కేటాయించినట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు.