వేల ఎకరాలను ముందే కొనుగోలు చేసిన కాంగ్రెస్ నేతలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్
ధరణిపై భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుద చేయండి
ధరణిపై వేసిన కమిటీ నివేదిక బహిర్గతం చేయాలి
కాంగ్రెస్ కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు?
బీఆరెస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే అగ్గువకు కొనుగోలు చేసి… రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందని, దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆరెస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్ కుమార్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆరెస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని సంజయ్ విమర్శించారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని, పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారని సంజయ్ ఆరోపించారు.
భూమాతతో భూమేతకు కాంగ్రెస్ నేతల ప్లాన్
ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారని బండి సంజయ్ ఆరోపింఆరు. బీఆరెస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. అసైన్డు భూములను, శిఖం భూములను, దేవాదయ, అటవీ, భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆరెస్ నేతలు కాజేశారన్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వివరాలేవి? వాటిని ఎందుకని రేవంత్ సర్కారు బయట పెట్టడం లేదని నిలదీశారు. ఆ భూముల విలువ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ధ ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏది? ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవరో ఎందుకు తేల్చడం లేదన్నారు. ధరణిపై వేసిన కమిటీ బీఆరెస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా దోచుకోవాలా? అనే అంశంపై రహస్య నివేదిక ఇచ్చినట్లుందన్నారు. అందుకే ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కన్పించడం లేదని, ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విలీనంతో ప్రజలపై పన్నుల భారం
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డు.. వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిదని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం మోపేందుకే విలీన కుట్ర చేస్తున్నారని, 15 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారులోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని, వాటిని అభివృద్ధి చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్ధం లేనిదని బండి సంజయ్ మండిపడ్డారు. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.
రుణమాఫీ లబ్ధిదారుల లెక్కల్లో మోసం
ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, లబ్ధిదారుల లెక్కల్లో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహారిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే… లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరమన్నారు. అంటే నూటికి 70 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, ఒకవైపు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి, బయట చేసిన అప్పులు తీరక, పెట్టుబడికి పైసల్లేక రైతులు అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతోందన్నారు. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేసేందుకు కాంగ్రెస్ నేతలకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల దృష్టిని మళ్లించడం అలవాటైపోయిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులుసహా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోందని, ఈ మేరకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.
బీఆరెస్ మాదిరిగానే ఎంఐఎంకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్
బోనాల పండుగకు ప్రభుత్వం నిధులివ్వదని, హిందువుల పండుగలకు పైసలివ్వరని,.సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. రంజాన్ కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. బీఆరెస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందని, ఈ విషయంపై మాట్లాడితే నాపై మతతత్వ ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే వ్యవహరిస్తే బీఆరెస్ పట్టిన గతే పట్టడం ఖాయమన్నారు.
ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునగడం ఖాయమని, 15 నిమిషాలపాటు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ ఒవైసీని తీసుకెళ్లి కొడంగల్ లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలతో ఆలోచించి, బీజేపీని విమర్శించడం మాని కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి మేం పూర్తిగా సహకరిస్తామని, కలిసికట్టుగా పనిచేసి నిధులు తీసుకొద్దామని, అంతే తప్ప ప్రధానమంత్రిని అదే పనిగా తిట్టడంవల్ల నష్టమే తప్ప లాభం లేదనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు.