- భారత్ సమ్మిట్ ద్వారా దిశానిర్దేశం
- ఈ సదస్సు చరిత్రాత్మకమైనది
- కాంగ్రెస్ మూల సిద్ధాంతాలే ఆధారం
- రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాం
- ఉగ్రవాదాన్ని ఒక్కటై ఎదిరిద్దాం
- మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు
- పెహల్గామ్ ఘటనకు నిరసనగా
- ప్రతినిధుల కొవ్వొత్తుల ప్రదర్శన
- స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతినిధులు
హైదరాబాద్: భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం చేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. ప్రపంచంలో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో, ప్రపంచం మొత్తం రెండు కూటములుగా విడిపోయిన సమయంలో కొన్ని దేశాలతో కలిసి ఆనాటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ అలీన విధానాన్ని తీసుకొని ప్రపంచానికి దిశా నిర్దేశం చూపారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అహింస, సత్యం, సామాజిక న్యాయం అనే మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ సమ్మిట్ ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల ఆధారంగా భారత్ సమ్మిట్ జరుగుతున్నదని అన్నారచు. ఈ సమ్మిట్‌లో శాంతి కాముకులు, ప్రపంచ న్యాయం కోరుకునేవారు (గ్లోబల్ జస్టిస్), ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగిన వారు 8 ప్యానెల్స్‌గా చర్చల్లో పాల్గొన్నారని వివరించారు.
వంద దేశాల నుంచి ప్రతినిధులు
భారత్ సమ్మిట్‌కు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని భట్టివిక్రమార్క చెప్పారు. లింగ న్యాయం, ఫెమినిస్ట్ ఫ్యూచర్, ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, కౌంటరింగ్ డిసిన్ఫర్మేషన్, యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, సేవింగ్ న్యూమల్టీ ల్యాటరలిజం వంటి అంశాలపై లోతుగా చర్చించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం గురించి భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామని భట్టివిక్రమార్క తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో ప్రపంచ ప్రతినిధులకు వివరించామని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రీజినల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్స్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవం, నాలెడ్జ్ ఐటీ సెంటర్, ఇందిరా గిరి జల వికాసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల గురించి భారత్ సమ్మిట్ హాజరైన ప్రతినిధులకు వివరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం పట్ల ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. దేశానికే మోడల్ గా నిలవబోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ప్రతినిధులను కోరినట్లు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న గ్లోబల్ జస్టిస్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు స్వాగతించి, అభినందించారని వెల్లడించారు.
పహల్గామ్ ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా, బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొంటామని భారత్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు తెలిపారని భట్టి చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశం కోసం అందరం ఒక్కటై నిలబడదామని పిలుపునిచ్చారు. శాంతి, అహింసా మార్గంలో గ్లోబల్ జస్టిస్ కోసం కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు.