Site icon vidhaatha

Mohan Charan Manji | నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం … ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాంజీ

విధాత, హైదరాబాద్ : ఒడిస్సా నైనీ బొగ్గు గనుల్లో త్రవ్వకాలకు సహకరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాంజీ సానుకూలంగా స్పందించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా ఒడిస్సా వెళ్లి సీఎం మాంజీని కలిసి 2015లో సింగరేణి కేటాయించిన ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం మాంజీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని భరోసానివ్వడమే కాకుండా అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరెందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిస్సా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. 2017 లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. నాడు అందచేసిన వినతి పత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైని బ్లాక్ లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిస్సా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సన అంశం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒడిస్సా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఒడిస్సా సర్కార్ కు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైనీ బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిస్సా సీఎంకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నపంతో ఒడిస్సా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి బృందానికి స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నత అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version