విధాత, వరంగల్ ప్రతినిధి:
వరద ముంపుబారి నుంచి వరంగల్ నగరాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని ఎవరుకూడా అధైర్య పడవద్దని కోరారు. మొంథా తుఫాను ప్రభావం తో కురిసిన భారీ వర్షానికి జల మయమైన ప్రాంతాల్లో మంత్రి, లోక్ సభ సభ్యురాలు డా.కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తో కలిసి గురువారం వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు దైర్యం కలిగించారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా భారీ వర్షాలు కురిసాయన్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్, డి ఆర్ ఎఫ్ ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత 5 సం.ల నుండి ముంపు పరిస్థితి తలెత్తుతున్నదన్నారు.నగర పరిధి లో లోతట్టు ప్రాంతాలు ఉండడం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురి అవ్వడం, సరైన వెడల్పుతో నాలాలు ఉండకపోవడం ఇందుకు కారణమన్నారు. ఇకముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారి ఆదేశం మేరకు ముందుకు వెళతామని మంత్రి తెలిపారు.వరద వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్ పల్లం పద్మ రవి, డిఎఓ అనురాధ, డిఎం హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల అధికారులు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
