- అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
- వారం రోజుల్లో పనులు ప్రారంభించాలి
- అధికారులు లబ్ధిదారులకు బిల్లులు అందించాలి
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
జనగామ, అక్టోబర్ 14 (విధాత) : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, అందుకే సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదనే అమలు చేస్తుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 256మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు వ్యవసాయ మోటార్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల స్వంత ఇంటి కల ను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 22వేల 500కోట్ల రూపాయల ఖర్చుతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని అన్నారు.
ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 3వేల 500 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 3360ఇండ్ల కు మంజూరు పత్రాలు అందజేశామని, అందులో 95శాతం ఇండ్ల పనులు ప్రారంభమై వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. రాబోయే 2,3 నెలలలో మరో 3,500ఇల్లు రాబోతున్నాయని అర్హులైన వారు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఎవరికీ కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వవద్దని అన్నారు.
మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింకేజి వంటి వాటిని సరిచూసుకోవాలని తెలిపారు. అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ సకాలంలో బిల్లులు వచ్చే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ఆర్థిక వెసులుబాటు లేని వారికీ మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసే విధంగా ఎంపిడివో లు చర్యలు తీసుకోవాలన్నారు.
అర్హులైన పేద ప్రజలకు స్వంత ఇంటి కల ను నెరవేర్చాల్లన్నదే తప కోరిక అని కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనగామ, హన్మకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు మాతృ నాయక్, హరికృష్ణ, స్టేషన్ ఘనపూర్ ఆర్డివో వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, డిఈలు, ఏఈలు, ఎంపిడివోలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.