అమరావతి: మొంథా తుపాన్ ను ఎదుర్కోవడంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మొంథా తుపాన్ ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల యంత్రాంగంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో మొంథా తుఫాన్ ఉందని. 16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తున్న తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయని, రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని వివరించారు. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు సూచించారు. మొంథా తుఫాన్ ప్రభావంపై ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ వివరాలు తెలుసుకున్నారని, ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు చంద్రబాబు సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ల నంబర్లు ప్రజలందరికి తెలుపాలని సూచించారు. అత్యవసర సహాయ నంబర్లు 112 | 1070 | 1800 425 0101 లకు తుపాన్ సహాయక చర్యల కోసం ఫోన్ చేయాలని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు.
సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలి
మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం కావాలని చంద్రబాబు తెలిపారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి…ప్రత్యేక అధికారులను నియమించాం. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
