Site icon vidhaatha

buffer zone | కబ్జాకోరుల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా.. అసలీ బఫర్‌ జోన్‌ అంటే ఏమిటి?

Buffer zone | గత కొద్ది రోజులుగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (HYDRA).. హైడ్రా కొరడా ఝళిపిస్తున్నది. ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ (N Convention)ను బఫర్‌ జోన్‌లో నిర్మించారంటూ కూల్చివేశారు. మరికొందరు ప్రముఖులు కూడా హైడ్రా జాబితాలో ఉన్నారని వినిపిస్తున్నది. హైడ్రా నోటీసులు వంటివి ఏమీ జారీ చేయబోదని, ఎఫ్‌టీఎల్‌ (FTL), బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలను డైరెక్టుగా కూల్చేస్తుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath) తేల్చి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలీ బఫర్‌ జోన్‌ (Buffer zone) అంటే ఏమిటి? ఎఫ్‌టీఎల్‌ అంటే ఏమిటి అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. వీటితోపాటు మరికొన్ని పదాలపైనా సెర్చ్‌ చేస్తున్నారు. వీటిలో ఎఫ్‌టీఎల్‌ అంటే ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (Full tank level). అంటే చెరువు లేదా రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం అన్నమాట. బఫర్‌ జోన్‌ అంటే.. ఎఫ్‌టీఎల్‌ ఏరియాకు అనుకుని ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్‌ జోన్‌ అనేది సదరు చెరువు లేదా వాగు, కాల్వల పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆక్రమణలను నిరోధించి, చెరువులు, రిజర్వాయర్లు, నాలాల చుట్టూ సహజ పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ఈ బఫర్‌ జోన్‌లను ఉద్దేశించారు.

చెరువు అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి ఈ బఫర్‌ జోన్‌లను మ్యాపింగ్‌ చేస్తారు. దానిని సదరు గ్రామ మ్యాపులపై సూపర్‌ ఇంపోజ్‌ చేస్తారు. తద్వారా రక్షిత ప్రాంతాలకు సంబంధించి స్పష్టమైన విభజన రేఖ గీస్తారు. నీటిపారుదల, రెవెన్యూ రూల్‌ బుక్‌ ప్రకారం.. నదులు, కాలువల తీరం వెంబడి లేదా చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేదా చిన్న కుంటల సిఖం భూములలో ప్రత్యేకంగా ఏమన్నా పేర్కొంటే తప్ప ఎలాంటి నిర్మాణాలను అనుమతించరు.

బఫర్‌ జోన్స్ : మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, హెచ్‌ఎండీఏ (HMDA), అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌ Buffer Zone)గా పేర్కొంటారు. పది హెక్టార్ల విస్తీర్ణం కలిగిన చెరువులు, జలాశయాలు, కుంటలు వంటివి అయితే వాటి ఎఫ్‌టీఎల్‌ నుంచి 30 మీటర్ల వరకూ బఫర్‌ జోన్‌గా పరిగణిస్తారు. దానిలో 12 అడుగుల వెడల్పు నడకదారి/ సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు.

పది హెక్టార్లలోపు విస్తీర్ణం కలిగినట్టయితే సదరు చెరువులు, జలాశయాలు, కుంటల ఎఫ్‌టీఎల్‌ సరిహద్దు నుంచి 9 మీటర్ల వరకూ బఫర్‌ జోన్‌గా పరిగణిస్తారు. కాలువలు, చిన్న వాగులు అయితే.. వాటి పూర్తిస్థాయి నీటిమట్టం సరిహద్దు నుంచి 9 మీటర్లు బఫర్‌ జోన్‌గా ఉంటుంది. పది మీటర్ల వెడల్పు కలిగిన కాలువలు, వాగులు, నాలాలు, తూములయితే సరిహద్దు నుంచి 2 మీటర్ల వరకూ బఫర్‌ జోన్‌గా గుర్తిస్తారు. మరింత సమగ్ర సమాచారం కోసం నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల అధికారులను సంప్రదించవచ్చు.

Exit mobile version