రియాక్టర్లు ఎందుకు పేలుతున్నాయి?

  • Publish Date - April 5, 2024 / 07:46 AM IST

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్‌బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన సంఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యం, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటమే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యజమాన్యం క్వాలిటీ కంట్రోల్‌తో రియాక్టర్ నాణ్యతను పరిశీలించలేదని తెలుస్తోంది. రియాక్టర్‌ లోపమేనా? లేక పరిశ్రమలో పనిచేసే యంత్ర పరికరాల్లో లోపాలు రియాక్టర్‌ పేలుడుకు కారణమయ్యాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వీటిపై ఇటు యాజమాన్యం కానీ అటు అగ్నిమాపక అధికారులు కానీ వివరాలు ఇవ్వలేక పోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, జిన్నారం, నర్సాపూర్ వంటి ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ.. లోపం కనిపెట్టే ప్రయత్నం మాత్రం ఎక్కడా జరగడం లేదని అంటున్నారు.

వాస్తవానికి ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి రియాక్టర్‌ నాణ్యతను, పనిచేసే విధానాన్ని క్వాలిటీ కంట్రోల్‌తో పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ.. దీనిని పరిశ్రమల యజమానులు పట్టించుకోవడం లేదని, నిఘా పెట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియాక్టర్‌కు 140 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ట్రోగ్రత వరకు మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత అంతకు మించితే రియాక్టర్ పేలి పోతుందని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ ఆయిల్‌తో లేదా బొగ్గుతో ఒత్తిడి పెరిగితే కూడా రియాక్టర్‌ పేలిపోయేందుకు ఆస్కారం ఉంటుందని వివరిస్తున్నారు. రియాక్టర్‌పై ఒత్తిడి పెంచే సమయంలో సంబంధిత నిపుణులు, కార్మికులు దానిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. రియాక్టర్‌ వేడిని తట్టుకోలేక పేలిపోతుందని అంటున్నారు. ప్రెషర్‌తో పనిచేసే రియాక్టర్‌ టీమ్‌లో ఉండేవారు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. 140 డిగ్రీల నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో వెంటనే దానిని చల్లబర్చాల్సి ఉంటుందని అంటున్నారు. రియాక్టర్‌లో ఆయిల్‌ను బాయిల్‌ చేయడం ఆపివేయాలని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కాలం చెల్లిన రియాక్టర్లే పేలిపోతుంటాయని పేర్కొంటున్నారు. ఇది తెలిసీ అనేక కంపెనీల్లో కాలం చెల్లిన రియాక్టర్లను కొనసాగిస్తున్నారని సమాచారం. ఇటువంటివాటిని తనిఖీ బృందాలు ఎప్పటికప్పుడు గుర్తించాలని, యాజమాన్యాలు కూడా కాలం చెల్లిన రియాక్టర్లను వాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News