Harish Rao : రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు.. ఫ్లైయింగ్ సీఎం

సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని, ఆయన 'రైజింగ్ సీఎం' కాదు 'ఫ్లయింగ్ సీఎం' అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు.

Harish Rao

విధాత : సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు.. ఫ్లైయింగ్ సీఎం అని..ఇప్పటికి 61 సార్లు ఢిల్లీకి పోయిండని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల అభినందన సభలో ఆయన మాట్లాడారు. కనీసం రైతులకు యూరియా కూడా ఇయ్య చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌ది అని మండిపడ్డారు. యూరియా యాప్ లో నమోదు చేసుకోవాలంటున్నాడని, యాప్ ఏమో పనిచేయడం లేదన్నారు. రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసా రెండు సార్లు ఎగవేశాడని, రైతు రుణమాఫీ సగమే చేశాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 66శాతం సర్పంచ్ లు గెలిచామని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పుకున్నాడని, రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 66శాతం సర్పంచ్ లు గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకుంటే..గతంలో 90శాతం సర్పంచ్ లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 39మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి అధికారంలోకి రాలేదని, ఈ లెక్కన 66శాతం గెలిచిన కాంగ్రెస్ కు 10-12 ఎమ్మెల్యేలు మాత్రమే వస్తాయని చురకలేశారు.

ఎన్నికల హామీల అమలులో రేవంత్ మోసం

కేసీఆర్ గెలవగానే రెండు వందల రూపాయల పెన్షన్‌ను రెండు వేలు రూపాయలు చేసిండు.. రేవంత్ గెలిచి రెండేళ్లయినా పెన్షన్‌ను నాలుగు వేల రూపాయలు చేయలేదని, ఆరు గ్యారంటీలు, 420హామీల అమలులో ప్రజలను మోసగించి అబద్దాల ప్రచారంతో రోజులు వెళ్లదీస్తున్నాడని హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మనుమడి సోకుల కోసం రూ. 100 కోట్లతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిస్తారా అని, మరో 100కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టాడని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి కోపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదు అన్నారు. సర్పంచ్ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4వేల సర్పంచ్ లు గెలవడంతో..కారు జోరుకు కాంగ్రెస్ బేజారైపోగా.. సీఎం రేవంత్ రెడ్డి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వాయిదా వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ ఒక్క గ్రామ సర్పంచ్‌కే ఉంది.. ధైర్యంగా పనిచేయండన్నారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీ కాలంలో మిగిలిన మూడేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారని.. మీ పనుల బాధ్యత నాది అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :

Actress Aamani : బీజేపీలో చేరిన నటి ఆమని
Pawan Kalyan : కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

Latest News