Site icon vidhaatha

బీఆరెస్ మ్యానిఫెస్టో కాపీ పేస్ట్: ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టి తన మ్యానిఫెస్టో తయారు చేసుకున్నారని కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కొత్తగా ఇచ్చిన హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, బ్రహ్మాండం బద్దలయ్యేలా మ్యానిఫెస్టో తెస్తామని చెప్పి, చివరకు బొక్క బోర్ల పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని మాట్లాడిన బీఆరెస్ పెద్దలు, ఇప్పుడు తాము ప్రకటించిన అలవి గాని హామీలకు పైసలు ఏడు నుంచి తెస్తారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.


మహబూబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నం మాట్లాడారు. బీఆర్ఎస్ తెలంగాణలో ఉనికిని కోల్పోయిందని, కేసీఆర్ ఆలోచనా శక్తిని కోల్పోయారన్న విషయం ఈ మ్యానిఫెస్టో ద్వారా బట్టబయలైందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద తాము మహిళలకు నెలకు రెండు వేలు ఇస్తామంటే, కేసీఆర్ దాన్ని మూడు వేలు చేశారని, గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకే ఇస్తామని మేమంటే, దాన్ని కూడా కాపీ కొట్టారని విమర్శించారు. పాత హామీలను అమలు చేయకుండా, సాధ్యం కానీ హామీలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న కేసీఆర్ పన్నాగాన్ని ప్రజలు బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ పార్టీ ఒక్కమాట చెబితే దానికి కట్టుబడి ఉండే పార్టీ అన్న విషయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు ఎప్పుడో అర్థమైందన్నారు. బీఆరెస్ పదేళ్ల పాలనలో ఇచ్చినవి 1500 డబుల్ బెడ్ రూమ్ లు మాత్రమేనని, అవి కూడా నిజమైన లబ్ధిదారులకు రాకుండా, తమ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని మండిపడ్డారు. పాలమూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నాయకులు బెనహర్, అజమత్ పాల్గొన్నారు.

Exit mobile version