సీపీఎం నేత తమ్మినేనికి గుండెపోటు.. ప్రమాదం లేదన్న వైద్యులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వల్ప గుండె పోటుకు గురయ్యారు. ప్రమాదం ఏమీ లేదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారని తెలిసింది.

  • Publish Date - January 16, 2024 / 11:04 AM IST

హైద‌రాబాద్ ఏఐజీకి త‌ర‌లింపు.. ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఆరోగ్యం

విధాత‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (70)కు మంగళవారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న‌కు గుండెపోటు రావడంతో హైద‌రాబాద్‌లోని ఏఐజీ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న సమయంలో ఉద‌యం వేళ తమ్మినేని శ్వాస తీసుకోవటానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. గ‌మనించిన‌ కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక‌ ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు.

అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తోపాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలు ఉన్న‌ట్టు గుర్తించారు.మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆయనను హుటాహుటిని హైదరాబాద్‌లోని ఏఐజీ ద‌వాఖాన‌కు తరలించారు. వీర‌భ్ర‌దాన్ని ప‌రీక్షించిన వైద్యులు ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డగా ఉన్న‌ట్టు తెలిపారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని పేర్కొన్నారు.

గతంలోనూ తమ్మినేనికి గుండెపోటుకు గుర‌య్యారు. అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్‌ వేశారు. ఇప్పుడు మరోసారి మైల్డ్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తమ్మినేని పోటీ చేశారు. తమ్మినేనికి కేవలం 5308 ఓట్లు వ‌చ్చాయి. ఆయన మూడో స్థానంలో నిలిచారు. పాలేరులో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 57,231 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన సంగ‌తి తెలిసిందే.