- టోర్నోడో తరహా భారీ సుడిగాలి
- 500 ఎకరాలలో చెట్లు నేలమట్టం
- అంతుచిక్కని విపత్తుతో భారీ విధ్వంసం
- విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు
- నిపుణుల అభిప్రాయ సేకరణ
- సంఘటన పై పరిశోధన అవసరం
- ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
Medaram a warning । విధాత ప్రత్యేక ప్రతినిధి: అడవి గుండె అల్లకల్లోలమైంది. ఆకుపచ్చని చెట్లు అల్లలాడుతూ కూకటివేళ్ళతో నెలకొరిగాయి. దట్టమైన అడవి (dense forest).. తలలు నరికేసినట్లు బోసిపోయి కనిపిస్తోంది. తాడ్వాయి మేడారం రహదారికి (Tadwai Medaram road) ఇరువైపులా దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూకటివేళ్లతో పెకిలిన వృక్షాలు, సగం నరికేసినట్లుగా ఉండే చెట్లే కనబడుతున్నాయి. రెండు వందల హెక్టార్లలో ఒక క్రమపద్ధతిలో ఎవరో పనిగట్టుకొని కూల్చినట్టుగా (uprooted) కన్పిస్తున్న మొదళ్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రకృతి చేస్తున్న హెచ్చరికకు (Nature’s warning) ప్రతీకగా మారాయి. ఏటూరునాగారం మండలం, తాడ్వాయి మండలాల్లో కేవలం రెండు గంటల్లోనే టోర్నడో (Tornado) రీతిలో పెను గాలులు విధ్వంసం సృష్టించాయి. పచ్చని చెట్లను నేలమట్టం చేశాయి. ప్రకృతి హెచ్చరిక చేసిందని తెలుస్తోంది. కానీ కారణం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. 200 హెక్టార్లలో లక్ష వరకు చెట్లు నేలమట్టం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్లౌడ్ బరస్ట్‌తోపాటు బలమైన ఈదురు గాలులు విధ్వంసం సృష్టించినట్లు చెబుతున్నారు. ‘టోర్నడో’ తరహా బలమైన గాలుల వల్లే ఇంత విపత్తు చోటు చేసుకుందనేది అధికారుల అభిప్రాయం. అటవీ ప్రాంతం నేలమట్టం కావడంపై ఫారెస్ట్ అధికారులు శాస్త్రీయ కారణాలను (scientific reasons) అన్వేషించే పనిలో పడ్డారు.
31వ తేదీ సాయంత్రం ఘటన!
31వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఘోర విపత్తు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి (Tadwai), పస్రా ఫారెస్ట్ రేంజ్‌లో కొండపర్తి, కొండాయి, షాపల్లి సమీప అటవీ ప్రాంతంలో ఏకంగా లక్ష వరకు వేల చెట్లు నేలకొరగడం అందరినీ కలవరానికి గురి చేస్తున్నది. గతంలో ఎంతటి భారీ వర్షాలు (heavy rains) కురిసినా అటవీ ప్రాంతాలు (forest areas) ప్రభావితమైన దాఖలాలు చాలా తక్కువే ఉండేవి. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలకు చిన్న, పెద్ద వృక్షాలు అన్ని కలిపి లక్షవరకు చెట్లు నేలమట్టం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విధ్వంసంలో అడవిలోని అరుదైన ఏగిస (Egisa), జువ్వి (Juvvi), నారెప (Narepa), నల్లమద్ది (Nallamaddi), తెల్లమద్ది (Tellamaddi), మారేడు (Maredu), నేరేడు (Neredu), ఇప్ప (Ippa) వంటి మిశ్రమ జాతుల చెట్లు కుప్ప కూలిపోయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఏరియా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతుబట్టని కారణం
సుమారు లక్ష చెట్లు నేలకూలడం వెనుక కారణాలు అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు. పరిశీలనకు వస్తున్న ఉన్నతాధికారుల్లో కొందరు క్లౌడ్ బరస్ట్ (cloud burst) అంటుంటే, మరికొందరు టోర్నడో లాంటి (tornado-like) సుడిగాలి వల్ల జరిగి ఉంటుందని అంటున్నారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ విధ్వంసం డ్రోన్ కెమెరాల (drone cameras) ద్వారా బయటపడింది. ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు కూలడం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (SRSC) సైంటిస్టుల సాయం కోరింది.
మట్టి శాంపిల్స్ సేకరణ
ఇప్పటికే టెస్టుల కోసం అక్కడి మట్టిని (soil samples) ల్యాబ్స్‌కు పంపించారు. అటవీ ప్రాంతం నేలమట్టం కావడంపై ఫారెస్ట్ అధికారులు శాస్త్రీయ కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఈ మేరకు చెట్లు కూలిపోయిన ప్రదేశంలో మట్టి శాంపిల్స్ సేకరించారు. దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని, వాటిని ల్యాబ్‌కు (lab) పంపి పరీక్షించే పనిలో పడ్డారు. చెట్లు నేలకూలడానికి అసలు కారణాలు ఏంటి.. అక్కడి నేల స్వభావం (change in nature) ఏమైనా మారిందా.. లేదా ఇందులో కుట్ర ఏమైనా దాగి ఉందా.. అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల కిందటే మట్టి శాంపిల్స్ కు పంపించగా.. అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఒక వేళ నేల స్వభావం మారితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ ప్రాంత రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ సిబ్బంది వివరించారు. ఐఎండీ, ఎస్ఆర్ఎస్సీ టీమ్స్ ఒకట్రెండు రోజుల్లో తాడ్వాయి అడవులకు (Tadwai forests) వచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నాయి. గూగుల్ ను వినియోగించుకోవాలని యోచిస్తోంది.
31న సాయంత్రం సంఘటన
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యం దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడ్వాయి అటవీ పరిధిలో గత నెల 31న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం పడింది. తాడ్వాయి-మేడారం రోడ్డుకు అడ్డంగా సుమారు 200 చెట్లు కూలి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో అదే రోజు రాత్రి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్లు జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తెల్లారిన తర్వాత అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది. అక్కడి పరిస్థితిని చూసి షాకయ్యారు. ఎక్కడ చూసినా వేళ్లతో సహా పెకిలి పడిపోయిన చెట్లు కనిపించాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించి 500 ఎకరాల విస్తీర్ణంలో లక్షకు పైగా చెట్లు కూలిపోయినట్టు గుర్తించారు. క్లౌడ్ బరస్ట్ వల్ల గానీ, టోర్నడో లాంటి సుడిగాలి వల్ల గానీ ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గత నెల 31న కురిసిన కుండపోత వర్షంతో పాటు తీవ్ర గాలి దుమారం వల్లనే చెట్లు కూలిపోయాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉండవచ్చని ఫారెస్టు ఆఫీసర్లు చెబుతున్నారు. పీసీసీఎఫ్ డోబ్రియాల్, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమా నాయక్, ములుగు డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటించి కూలిపోయిన చెట్లను పరిశీలించారు. చెట్లు కూలడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా పర్యావరణవేత్తలు (environmentalists) , వృక్షశాస్త్రజ్ఞులు (botanists) ఇప్పుడిప్పుడే పరిస్థితిపై ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బలమైన గాలులు, అటవీ వాతావరణం, భూసారం క్షీణత, చెట్ల వేళ్ళు పట్టుకోల్పోవడం తదితర కారణాలు చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదంటున్నారు.
క్లౌడ్ బరస్ట్ కావచ్చు : పీసీసీ ఎఫ్ డోబ్రియాల్
‘చెట్లు కూలడానికి క్లౌడ్ బరస్ట్ కారణం అయి ఉండవచ్చు. నా 35 ఏండ్ల సర్వీస్లో ఇలాంటి ఘటన చూడలేదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాల్లో మేఘాలు కిందికి వచ్చి, ఒకేసారి బలమైన గాలులు వీచి వానలు కురుస్తాయి. ఇక్కడ అలాగే జరిగిందనుకుంటున్నాం’ అని పీసీసీఎఫ్ డోబ్రియాల్ చెప్పారు. తాడ్వాయి అడవి కింద సారవంతమైన నేలలు ఉన్నాయని, అందువల్ల చెట్లకు పైపైనే పోషకాలు, నీళ్లు దొరుకుతున్నాయన్నారు. అందుకే వేర్లు పైపైనే ఉన్నాయని, భూమి లోపలికి వెళ్లలేదని తెలిపారు. వేర్లు బలంగా లేకపోవడం వల్లే బలమైన గాలికి కిందపడినట్టు అనుమానిస్తున్నామని, కానీ శాస్త్రీయ కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల సాయం కోరామని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
ఆరా తీసిన మంత్రి సీతక్క
రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీ ఎఫ్ ఓలతో మంత్రి సీతక్క టెలిఫోన్లో మాట్లాడి సంఘటన పై ఆరా తీశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నెలకూలడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయని భావిస్తున్నట్లు చెప్పారు. వందల ఎకరాల్లో వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని చెప్పారు