Sunkara Ramachandra Rao | ప్రముఖ మార్క్సిస్టు అధ్యయనకారుడు కామ్రేడ్ సుంకర రామచంద్రరావు మంగళవారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. కొన్నేళ్లుగా ఆయన డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
సుంకర రామచంద్ర రావు తండ్రి సుంకర శివరామయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలం నుండి విజయవాడలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఆ తరువాత సీపీఎంలో పనిచేశారు. నక్సల్ బరీ ఉద్యమం నుంచి తటస్థంగా కమ్యూనిస్టు ఉద్యమ సానుభూతిపరుడుగా ఉంటున్నారు. ఆయన పెద్ద కుమారుడు సుంకర రామచంద్ర రావు నక్సల్ బరి వసంత మేఘ గర్జనతో శ్రీకాకుళం బాటపట్టారు. ఆరు నెలలు పని చేసిన తర్వాత అనారోగ్యంతో వెనక్కి వచ్చారు. ఈ పద్ధతిలో విప్లవ విజయం సాధ్యపడదని అభిప్రాయపడేవారు. ఆయన ప్రముఖ మార్క్సిస్టు అధ్యయనపరుడు. పాత ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేశారు. ఆయన భార్య గుడివాడ తాలూకా కమ్యూనిస్టు నాయకుడు వెలగపూడి రత్నశేఖర రావు పెద్ద కుమార్తె. రామచంద్రరావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సోదరుడు సుంకర పాపారావు విజయవాడలో మొదటగా మోడరన్ అకాడమీ స్థాపించి, ICWA తదితర కోర్సులలో శిక్షణ ఇచ్చారు. రామచంద్ర రావు తన సోదరి లలితను కొందరు బంధువులు వ్యతిరేకించినా విరసం సభ్యుడు కామ్రేడ్ ఎం ఏ సత్యనారాయణ రావు గారితో వివాహం జరిపించారు.
పాత ఆంధ్రజ్యోతి పత్రిక మూతపడిన తర్వాత తన అధ్యయన కృషిని కొనసాగించిన రామచంద్రరావు.. పూర్తి కాలం మార్క్సిజాన్ని అధ్యయనం చేసేందుకు కేటాయించారు. మార్క్సిజాన్ని ఫ్రాయిడ్ కోణంలో అధ్యయనం చేశారు. ఆయన తన పీహెచ్‌డీలో మార్క్స్ పై ఫ్రాయిడ్ కోణంలో థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ తీసుకున్నారు. జర్మన్ మార్క్సిస్టు సైకాలజిస్ట్ విల్ హెల్మె రైక్ గ్రంథాలను మిత్రులకు పరిచయం చేశారు. ఆయన అనువాదాలు ప్రచురణ జరగవలసిన అవసరం ఉందని ఆయన సన్నిహితులు ఆకాంక్షించారు. ఆయన స్నేహపూర్వకంగానే అభిప్రాయ విషయములలో నిర్మోహమాటంగా ఉంటారని, ఏవీదాచుకోరని ఆయనను ఎరిగినవారు చెబుతుంటారు. విజయవాడ మార్క్సిస్టు అధ్యయన వేదిక, సోషల్ సైన్స్ ట్రస్ట్ నిర్వహించిన అనేక సెమినార్లలో రామచంద్రరావు ప్రసంగించారు. ఆయన గొప్ప వక్తే కాదు.. మిత్రులతో విస్తృతంగా చర్చించే పద్ధతి అయనది. మార్క్స్‌ను ఫ్రాయిడ్ కోణంలో అధ్యయనం చేయకపోవడం కమ్యూనిస్టుల లోపమని ఆయన భావన. అందువల్లనే కమ్యూనిస్టు ఉద్యమం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని ఒక సందర్భంలో ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన విద్యారంగం మీద సమ్మర్ హీల్, ఓ అల్పజీవి తదితర పుస్తకాలను అనువదించి తెలుగు సమాజానికి అందించారు. ఆయన “బ్రహ్మాస్త్రం ” పేరుతో అనేక సామాజిక విషయాల మీద గత శనివారం వరకు రాస్తూనే ఉన్నారు. ఇది అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆయన 75 సంవత్సరాలకే (ఆయన జన్మదినం ఆగస్టు 5, 1951) మరణించడం తెలుగు సమాజానికి నష్టమని పలువురు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయనలాగే మనము కూడా మర్క్సిజాన్ని సమాజానికి అందించటమే ఆయనకు మనం సమర్పించే నివాళని పేర్కొన్నారు.