- మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటా..
- నాతోనే ఉండండి.. కలిసి పనిచేద్దాం..
- అసంతృప్తులకు కేటీఆర్ బుజ్జగింపు?
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి ఎవరు? మళ్లీ కేసీఆర్ అవుతారా? కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? ఈ అంశంపై చాలాకాలం నుంచి చర్చలు ఉన్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్నికలు ముగిసి, మూడో దఫా బీఆరెస్ అధికారం చేపట్టిన తర్వాత కొద్ది నెలలకే సీఎం మార్పు ఉంటుందని తెలుస్తున్నది. ఏడెనిమిది నెలల తర్వాత బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన ఒక నేతకు మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి ఫోన్ చేసి, దాదాపు గంటకు పైగా మాట్లాడినట్లు సదరు నేత సన్నిహితుడొకరు తెలిపారు.
కేటీఆర్ మాటల్లో రాబోయే ప్రభుత్వంలో కొద్ది నెలల తర్వాత తానే సీఎం అవుతాననే భావన వ్యక్తమైందని సదరు నేత చెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆరెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఎనిమిది, తొమ్మిది నెలల తర్వాత భవిష్యత్తు మనదే. అన్నా.. మీరేం నారాజ్ కావద్దు. అన్నీ నేను చూసుకుంటా. నన్ను నమ్మండి’ అని అసంతృప్త నేతలకు, పార్టీ మారుతారనుకున్న నేతలను బుజ్జగిస్తున్నారని ఆయన తెలిపారు. ‘మీ గురించి నాకు తెలుసు కదా! మీరంతా నా టీమ్‌లో ఉంటారు’ అని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘మీకు టికెట్ ఇవ్వలేదని బాధపడవద్దు. సార్ సిటింగ్‌లకే ఇవ్వాలని నిర్ణయించారు కాబట్టి మీకు ఇవ్వలేక పోయాం.
వాస్తవంగా మీకే ఇవ్వాల్సి ఉండే. నియోజకవర్గంలో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ విషయాన్ని గుర్తించాను. భవిష్యత్తుల్లో మీకు మంచి గుర్తింపు ఇస్తాను. వచ్చేసారి తప్పని సరిగా టికెట్ ఇస్తాను’ అని కేటీఆర్ హామీ ఇచ్చారని సదరు నేత సన్నిహితుడు తెలిపారు. టికెట్ రాని నేతలకు, పార్టీ మారే అవకాశం ఉన్నదని తెలిసిన నేతలతో కేటీఆర్ మాట్లాడుతూ ఇవే విషయాలు చెబుతున్నట్టు సమాచారం.
ముందే శుభాకాంక్షలు చెప్పిన పద్మారావు
2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా అనేకసార్లు కేటీఆర్ సీఎం అవుతున్నారనే ప్రచారం జరిగింది. కొంతమంది నేతలు కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత ఉందని, కేటీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈటల రాజేందర్ వంటివారు సైతం కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు సైతం కేటీఆర్ సీఎం అయితే తనకేమీ అభ్యంతరం లేదని, కేసీఆర్ ఏది చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి, అందుకు పార్టీ నేతలను ఒప్పించే దిశగానే ఈ కసరత్తు జరిగిందనే అభిప్రాయాలు అప్పట్లో వెలువడ్డాయి.
అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఒక అడుగు ముందుకేసి.. స్వయంగా కేటీఆర్ ఉన్న వేదికపైనే.. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు.. అనడం రాజకీయంగా సంచలనం రేపింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ.. తానే సీఎంగా కొనసాగుతానంటూ కేసీఆర్ ప్రకటించి.. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడంతో ఆ ఎపిసోడ్ నాటకీయంగా ముగిసిపోయింది. అయినా.. భావి సీఎం కేటీఆర్ అనే చర్చ మాత్రం అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ తన దగ్గరకు వచ్చి తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేస్తాను.. మీరు ఆశీర్వదించాలని కోరారని వెల్లడించారు. దీంతో మళ్లీ ఈ విషయంలో చర్చ మొదలైంది.
బీఆరెస్‌గా మార్పుతో సంకేతాలు!
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు చేసిన ప్రకటన, టీఆరెస్ పేరును బీఆరెస్‌గా మార్చడం, పలు రాష్ట్రాల పర్యటన.. మహారాష్ట్రలో పార్టీ శాఖ, కార్యాలయం ఏర్పాటు, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరేనన్న చర్చ జరిగిన విషయం తెలిసిందే.