ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ఆత్మహత్యలు!

నేతల మధ్య వాగ్వాదం ఎలా ఉన్నా అంతిమంగా నిరుద్యోగులకు ప్రభుత్వం నిరాశనే మిగిల్చిందన్నది కాదనలేని వాస్తవమని ఉద్యోగార్థులు అంటున్నారు

  • నెరవేరని 80వేల కొలువుల హామీ
  • భర్తీపై కొరవడిన నిర్దిష్ట కార్యాచరణ
  • ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో
  • అంచనా లేకుండానే పరీక్షల తేదీలు
  • తీరా ఎన్నికల సమయంలో రద్దు
  • కమిషన్‌కు ముందే అవగాహన లేదా?
  • మండిపడుతున్న నిరుద్యోగులు

విధాత : నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్యతో మరోసారి కొలువుల భర్తీ అంశం చర్చల్లోకి వచ్చింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం ఎలా ఉన్నా అంతిమంగా నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నిరాశనే మిగిల్చిందన్నది కాదనలేని వాస్తవమని ఉద్యోగార్థులు అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా గత ఏడాది మార్చిలో అసెంబ్లీలోనే 80 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ కోసం మరుసటిరోజే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. వచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో వంటి పరీక్షలు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో రద్దయ్యాయి. అప్పుడే ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అయి, పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. లక్షలు ఖర్చుపెట్టి పండుగల సమయంలోనూ సొంత ఊళ్లకు వెళ్లకుండా ప్రిపరేషన్‌లో నిమగ్నమై, రాత్రింబవళ్లు కష్టపడి రాసిన పరీక్షలు.. వాటి నిర్వహణలో సర్వీస్‌ కమిషన్‌ నిర్లక్ష్యం కారణంగా రద్దయ్యాయి. ఆ సమయంలో మంత్రి కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి లీకేజీ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. ప్రస్తుతం అందరం కలిసి నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ.. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు.. ఆచరణలో మళ్లీ విఫలమయ్యాయని గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను కోర్టు మరోసారి రద్దు చేయడంతో తేలిపోయింది. దీనికంతటికీ ప్రధాన కారణం ప్రభుత్వం నియామకాల భర్తీ విషయంలో నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడమే కారణమని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రవళిక ఆత్మహత్య చేసుకోలేదని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోపాటు.. నిరుద్యోగులు సైతం ఆరోపిస్తున్నారు.

ఎన్నికల వేళ నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య, దానితోపాటే రగిలిన నిరుద్యోగుల ఆందోళన సహజంగానే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నియామకాల విషయంలో 2018 నుంచి అసెంబ్లీ వేదికగా, బైయట ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు నిలదీసినా పట్టించుకోలేదు. ఎప్పుడు అడిగినా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకొన్నదే తప్ప.. నియామకాల్లో జాప్యం, ఆయా నియామకాల సంస్థల వైఫల్యాలతో రద్దైన పరీక్షలు, కోర్టులు ఆ లోపాలపై లేవనెత్తిన ప్రశ్నల గురించి ఎన్నడూ సరిగ్గా స్పందించలేదని విద్యార్థి నేతలు చెబుతున్నారు.

పొంతన కదరని లెక్కలు

2011 మార్చి నాటికి 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వాదన. అయితే ప్రభుత్వ వాదనకు వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. 2021 మేలో టీఎస్‌పీఎస్సీ విడుదల ప్రకటన ప్రకారం 36,792 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తే వాటిలో 35,030 భర్తీ చేసినట్టు ప్రకటించింది. ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఎంపిక దశలో ఉన్నలో ఉన్నవి 1762గా పేర్కొన్నది. ఇవి కాకుండా 31 వేలకు పైగా పోలీస్‌ శాఖ ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శలు 9,355, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 3,623, ఆర్టీసీ 4,768, సింగరేణి 12,500, విద్యుత్తు సంస్థల్లో 6,648 పోస్టులతో పాటు ఆ శాఖలోనే పర్మినెంట్‌ చేసిన 22,637 ఉద్యోగాలూ ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం చెప్పిన ఉద్యోగాల భర్తీ అంశం అప్పటికీ పూర్తికాలేదని అర్థమవుతున్నది. ఇది కాకుండా ఏడాదిన్నర కిందట ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నోటిఫికేషన్లు విడుదల కాలేదు.

నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడం వల్లే!

ప్రకటించిన ఉద్యోగాల్లో గ్రూప్‌-1, 2, 3, 4లలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దయిన సంగతి తెలిసిందే. గ్రూప్‌-4 పరీక్ష ముగిసినా ఫైనల్‌ కీ మాత్రమే వచ్చింది. కానీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. గురుకుల పరీక్షల నేపథ్యంలో ఒకసారి, తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో మరోసారి గ్రూప్‌-2 వాయిదా పడింది. మొత్తం 783 పోస్టులకు సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దుకావడం, గ్రూప్‌-2 అయినా సజావుగా సాగుతుందనుకుంటే అదీ వాయిదాల మీద వాయిదా పడటం నిరుద్యోగ అభ్యర్థులను నిరాశ నిస్పృహల్లోకి నెట్టింది. ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు రద్దవుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో నిరుద్యోగ అభ్యర్థులకు కోచింగ్‌ సెంటర్ల వాళ్లు గాని, వాళ్ల ప్రిపరేషన్‌కు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు కూడా ధైర్యంగా చదవండి అని చెప్పలేకపోతున్నారు. జనవరిలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామని సర్వీస్‌ కమిషన్‌ మరో షెడ్యూల్‌ ప్రకటించినా ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో? ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష ప్రక్రియ యథావిథిగా కొనసాగుతుందా? రద్దవుతాయా? అనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? అన్నది ప్రభుత్వానికి తెలియంది కాదు. అలాగే నియామకాలు ఎప్పటిలోగా పూర్తిచేయాలని ఒక సరైన గైడ్‌లైన్స్‌ ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదంటున్నారు విద్యారంగ నిపుణులు.

నవ్వేటోని ముందు జారిపడ్డట్లు…

నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటివరకు గ్రూప్స్‌ పరీక్షలేవీ పూర్తికాలేదు. రాసిన పరీక్షలే మళ్లీ మళ్లీ రాయాల్సి రావడం, నియామక బోర్డులు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల గురుకుల మొదలు మొన్నటికి మొన్న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలు కోర్టు ఆదేశాలతో ఆగిపోయాయి. అదే పక్కన ఉన్న ఏపీ ప్రభుత్వం విభజన తర్వాత చంద్రబాబు హయాంలో 2011లో రద్దయిన గ్రూప్‌-1 పూర్తి చేయడమేకాకుండా.. 2016లో మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వేసి, పూర్తిచేసింది. తర్వాత జగన్‌ ప్రభుత్వం గ్రూప్‌-1 రెండుసార్లు పూర్తిచేసింది. మరోసారి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సిద్ధపడుతున్నది. గ్రూప్‌- 4, డీఎస్సీ, పోలీస్‌ ఒకసారి పూర్తికాగా రెండోసారి ప్రక్రియ కొనసాగుతున్నది, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను దశలవారీగా భర్తీ చేసుకుంటూ వెళ్తున్నది. అక్కడ కూడా కొన్ని నోటిఫికేషన్లపై అభ్యర్థులు కోర్టులకు వెళ్లినా వాటన్నింటినీ పరిష్కరించి నియామకాలను త్వరితగతిన పూర్తిచేస్తున్నది. అందుకే అక్కడి విద్యార్థులు ధైర్యంగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఉద్యోగార్థులు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీ అన్నది ప్రభుత్వానికే ఇష్టం లేదని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే నిరుద్యోగ అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పకుండా విపక్షాలవి రాజకీయం అంటూ, నియమకాలకు మోకాలడ్డుతున్నారని ఎదురుదాడి చేయడం గడిచిన తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ అనే మాట ‘నవ్వేటోని ముందు జారిపడవద్దు’ అనేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనేకరాఖండి చెబుతున్నారు.