విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఏటేటా అడ్డగోలుగా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగడం లేదు. ఎన్నికల్లో లబ్ధి కోసం రాజీయ పార్టీలు ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఆ తరువాత వాటిని అమలు చేయడానికి అప్పుల వేటకు దిగుతున్నాయి. బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలువాలన్న తలంపుతో ఓటర్లను ఆకర్షించేందుకు రెండు పార్టీలూ అలవి కాని హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం అనేక స్కీమ్‌లు ప్రకటించి, వాటిని పెండింగ్‌లోనే ఉంచింది.
అమలులో ఉన్న దళిత బంధు, బీసీలకు లక్ష నగదు సహాయం పథకాలు కూడా సరిగా అమలు చేయలేని స్థితి. ఇప్పటికే రాష్ట్ర ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేక పోవడంతో ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ప్రతి నెల పూట గడవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఏటా చేస్తున్న అప్పులతో రాష్ట్రం దివాలా అంచుకు చేరింది.
పెరిగిపోతున్న అప్పులు
తెలంగాణ ఏర్పడిన నాడు రూ.72,658 కోట్ల బడ్జెట్ అప్పులు ఉండగా, రూ.18,265 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు అప్పులు కలిపి ఆనాడు రూ.90,923 కోట్ల అప్పులున్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఈ 10 ఏళ్లలో రూ.3,66,306 కోట్లు బడ్జెట్ అప్పులు కాగా రూ. 1,35,282 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు కలిపి రూ.5,01,588 కోట్లకు పెరిగాయి.
ఇప్పటి పథకాలకే నిధుల్లేవు
ఇప్పటికే ప్రకటించిన అనేక పథకాలకు ఖజానాలో నిధులు లేని పరిస్థితి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి ఈ ఏడాది రూ.2 వేల కోట్ల వరకు కూడా ఖర్చు చేయలేని స్థితి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటి వరకు 300 మందికే దళిత బంధు పథకం అమలు చేశారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. దళిత బంధు పథకం అమలు చేయడానికే దాదాపు రూ.1.70 లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. అలాగే బీసీ బంధు కింద లక్ష ఆర్థిక సహాయానికి భారీగానే నిధులు అవసరమవుతాయి. ప్రస్తుతం నియోజక వర్గానికి 50 మంది చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన దళిత బంధు, బీసీ బంధు, ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చే రూ. 3 లక్షల నగదు పథకం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి నిధుల కొరతనే ప్రధాన కారణంగా చెబుతున్నారు. బడ్జెట్‌లో ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? వచ్చిన ఆదాయాన్ని ప్రాధాన్య క్రమంలో ఎలా ఖర్చు చేయాలన్నదానిపై ప్రణాళికా బద్దంగా ఆలోచన చేసి, నిర్ణయాలు తీసుకోక పోవడం వల్లనే అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకు పోతున్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో గెలుపు కోసం చేసే ఉచిత పథకాల హామీలు రాష్ట్రానికి గుదిబండగా మారుతాయని హెచ్చరిస్తున్నారు.
ఆదాయానికి, ఖర్చుకు పొంతనేది?
ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు నెలలు అంటే.. ఆగస్టు నెలాఖరు వరకు ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.48,942 కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.19,179.98 కోట్లు వచ్చాయి. భూముల అమ్మకాల ద్వారా మరో 2 వేల కోట్ల పైచిలుకు సొమ్ము వచ్చింది. కానీ ఖర్చు మాత్రం ఈ ఆరునెలల్లో రూ.1,23541.20 కోట్లుగా ఉన్నది. ఇవి కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలే. అంటే.. వచ్చిన ఆదాయానికి, ఖర్చుకు పొంతనే లేదు. దీంతో నెలవారీ ఖర్చులు, తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు నెలల్లోనే రూ.53,557 కోట్ల అప్పులు చేసింది. వాస్తవంగా ఈ ఏడాది మొత్తంలో తీసుకుంటామని అసెంబ్లీ అమోదం తీసుకున్న అప్పునంతా ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ ఎన్నికల తరువాత కొలువుదీరిన ప్రభుత్వం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
జీఎస్డీపీలో పెరిగిన అప్పు శాతం
తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 15.7 శాతం ఉండగా, ఇప్పుడు 28.2 శాతానికి చేరుకున్నది. ఇలా జీఎస్డీపీలో మన అప్పు పెరుగుతున్న తీరే రాష్ట్రం ఎలా ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నదో తెలియజేస్తుందని ఆర్థిక నిపుణుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్, కాంగ్రెస్ ఇచ్చే హామీలను పరిశీలిస్తే ఏడాదికి రూ. 5 లక్షల కోట్ల బడ్జెట్ కూడా సరిపోయేలా కనిపించడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 70.54 లక్షల మంది రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.16 వేల చొప్పున రైతు బంధు కింద రూ.25 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1700 కోట్లు బీమాకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆసరా పెన్షన్లు రూ. 5 నుంచి 6 వేల వరకు పెంచుతామని ప్రకటించారని వీటి అమలుకు కనీసం రూ. 30 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని, బీసీలకు లక్ష సహాయం, దళిత బంధు పథకాల అమలుకు దాదాపు రూ. 2లక్షల కోట్లు అవసరం అవుతాయని చెపుతున్నారు. ఇవి కాకుండా గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం పథకంతో పాటు ఓటర్లను నేరుగా ఆకర్షించడం కోసం తీసుకువచ్చే ఇతర నగదు పథకాల అమలుకు బడ్జెట్ సరిపోదని అంటున్నారు. ఇప్పటికే వేతన జీవులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించం లేదన్న చర్చ జరుగుతున్నది. కాంట్రాక్టర్లు కూడా నిరసనలకు దిగుతున్నారు. ఇలాంటి దుస్థితి ఉన్న ఈ రాష్ట్రంలో అలవి కానీ హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచిన తరువాత వాటిని అమలు చేయగలవా? వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? దాదాపు రూ. 5 లక్షల కోట్లు దాటిన ఈ అప్పులను ఏవిధంగా తీరుస్తారు? అన్నదానికి రాజకీయ నాయకుల నుంచి సమాధానం ఉంటుందా? అన్నదే వేయి డాలర్ల ప్రశ్న.