విధాత: అధికారపార్టీలో తమ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దని సొంతపార్టీ నేతలే రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. వారికి టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖామని వారు ఆ సందర్భంగా పార్టీ అధిష్ఠానానికి విన్నవించారు. కానీ బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ సిటింగులందరికీ దాదాపు టికెట్లు ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతల తిరుగుబాట్లను, నిరసనలను పరిగణనలోకి తీసుకోలేదు. కొన్నిచోట్ల పట్టించుకుని మార్చారు. అయితే ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు, నిరసనల గురించి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం వేరేలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఎందుకంటే అభ్యర్థి కంటే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌పైనే కొన్నిచోట్ల ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్లు క్షేత్రస్థాయిలో చర్చలను బట్టి తెలుస్తున్నది. పదేళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం సహజమే. కానీ అధికారపార్టీ నేతలు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నట్టు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టీఎస్ ఐపాస్ ద్వారా లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాల వంటివన్నీ సీఎంపై ఉన్న వ్యతిరేకతలో కొట్టుకుని పోయే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పథకాలు వచ్చినా.. అసంతృప్తి
కొన్నిగ్రామాల్లో సాగునీటి సౌకర్యం మెరుగైంది. రెండు పంటలు పండే అవకాశం వచ్చింది. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అయినా ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తున్నదని క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తున్నది. ప్రభుత్వం తెచ్చిన పథకాలకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. ధరణి వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారం కావడం లేదు. తమ గోడును చెప్పుకొందామంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.
కొంతమంది రైతులు మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా తమ చేతుల్లో ఏమీ లేదని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. ఇవన్నీ రైతుల్లో ప్రభుత్వ పట్ల వ్యతిరేకతకు కారణమౌతున్నాయి. ధరణి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విపక్ష కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ కేసీఆర్ ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తామని చెప్పకుండా.. ఆ పోర్టల్‌ను రద్దు చేస్తామన్న పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిస్తున్నారు. అయితే.. అది పెద్దగా రైతులను ఆకర్షించడం లేదని చెబుతున్నారు.
సాగు చేయనివారికీ రైతుబంధా?
రైతుబంధును వ్యవసాయం చేయని వారికి కూడా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీలింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి కౌలు రైతులు ఈ విషయంలో ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్న దళితబంధు పథకం వారికే బెడిసి కొడుతున్నది. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా తెచ్చిన ఆ పథకం గ్రామీణ ప్రాంతాల్లో విభజన తెచ్చింది. ఊరిలో ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చి మిగిలిన వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ బంధు, డబుల్ బెడ్ రూమ్‌ల విషయంలోనూ అదే అభిప్రాయంతో ఉన్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే స్థానిక అభ్యర్థి పనితీరు కంటే సీఎం వైఖరిపైనే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్, ఆయన ప్రచారమే చాలామంది అభ్యర్థులకు వరం అయ్యిందని, కానీ ఈసారి ఆయనపైనే వ్యతిరేకత వ్యక్తకావడం కొంతమంది అభ్యర్థులకు ఇబ్బందిగా మారిందటున్నారు. కొన్నిచోట్ల సీఎం పేరు ప్రస్తావించకుండా తాను గతంలో చేసిన పనులు, మళ్లీ అవకాశం ఇస్తే చేయబోయే పనుల గురించి ప్రజలకు హామీలు ఇస్తూ బీఆరెస్ అభ్యర్థులు ముందుకు సాగుతున్నట్టు సమాచారం.