Site icon vidhaatha

Congress Government । సీఎంగా రేవంత్‌రెడ్డికి ఎన్ని మార్కులంటే.. ఓటా సర్వేలో ఆసక్తికర అంశాలు

Congress Government । తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పాలనకు ఏడాది పూర్తి చేసుకుంటున్నది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించిందేంటి? చేయలేక పోయినదేంటి? ముఖ్యమంత్రి పని తీరు ఎలా ఉన్నది? అనే పలు అంశాలపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రా (వోటా) అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2024 నవంబర్ 25 నుండి డిసెంబర్ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. సింపుల్ రాండమ్ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్ సేకరించారు. వీరిలో 57% పురుషులు, 43% శాతం మహిళలు ఉన్నారు. పని ఆధారంగా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిరు వ్యాపారుల అభిప్రాయం సైతం సర్వే సంస్థ సేకరించింది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్లు ఆ పైన వారి వరకు సర్వేలో పాల్గొన్నారు.

ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలన ఎలా ఉంది? ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా? కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని అనుకుంటున్నారా? జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా? సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలతో పాటు కులగణ, కుటుంబ సర్వే అవసరమా? హైడ్రా మీ ప్రాంతానికి రావాలా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అనే ప్రశ్నలను సర్వే సందర్భంగా అడిగారు. ఈ సందర్భంగా ప్రజల పలు కీలక వ్యాఖ్యలను కూడా సర్వే సంస్థ తన రిపోర్టులో పొందుపరిచింది.

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా అన్న ప్రశ్నకు ‘అవును’ అని 16 మంది సమాధానంగా చెప్పగా.. కావడం లేదని 23 శాతం మంది చెప్పారు. కొన్ని మాత్రమే పరిష్కరిస్తున్నారని 34 శాతం మంది, తెలియదని 27 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా 14 శాతం మంది అవుతాయని చెప్పగా, 20% మంది కావని చెప్పారు. కొన్ని మాత్రమే అమలు అవుతాయని 62 శాతం మంది అన్నారు. తెలియదని నాలుగు శాతం మంది బదులిచ్చారు. 200 యూనిట్లలోపు వారందరికీ జీరో కరెంటు బిల్లు అమలు అవుతోందా? అన్న ప్రశ్నకు అవుతున్నదని చెప్పిన వాళ్ళు 34 శాతం ఉంటే.. కావటం లేదని ఏడు శాతం మంది చెప్పారు. కొంతమందికే అమలవుతున్నదని 50 శాతం మంది చెప్పగా రీడింగ్ లో మోసాలు ఉన్నాయని నాలుగు శాతం మంది చెప్పారు. జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయని 72 శాతం మంది చెప్పడం విశేషం.

ఎవరి పాలన బాగుంది? అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి పాలన బావుందని 30 శాతం మంది చెప్పగా కేసీఆర్ పాలన బాగుందని 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇద్దరి పాలన బాలేదని 19% మంది పేర్కొన్నారు. రెండు శాతం మంది కొత్త సీఎం రావాలని కోరుకున్నారు. రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందని 67% మంది విశ్వాసం వ్యక్తం చేయగా.. 12 శాతం మంది ఉండదని బదులిచ్చారు. రేవంత్ ను మారుస్తారని 9% మంది చెప్పారు. ఎవరు వచ్చినా ఇంతేనని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారన్న ప్రశ్నకు 25 మార్కులు వేస్తామని 59 శాతం మంది చెప్పగా, 50 మార్కులేస్తామన్న వాళ్లు 30%, 75 మార్కులు వేస్తామన్నవాళ్ళు 6%  ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఏడాది పాలన బాగుందని 31 శాతం ఉంది, ఫర్వాలేదని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. బాగోలేదని 30% మంది, చెత్తగా ఉందని 12 శాతం మంది చెప్పారు. ఇక కులగణన, కుటుంబ సర్వే అవసరమా? అన్న ప్రశ్నకు అవసరమేనని 50% చెప్పారు. అవసరం లేదన్న వాళ్ళు 23% ఉండగా, లెక్కలు బయటకు రావని 18 శాతం మంది పేర్కొన్నారు. హైడ్రా మీ ప్రాంతానికి రావాలా? అన్న ప్రశ్నకు.. వద్దు అని 43 శాతం మంది చెప్పగా, రావాలని 12 శాతం మంది కోరుకున్నారు. అక్రమ కట్టడం ఏదైనా కూల్చాల్సిందేనని 29 శాతం మంది చెప్పగా.. కేవలం బెదిరించడానికేనని 16% మంది పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమేనని 50 శాతం మంది చెప్పగా, అవసరం లేదని 15% మంది, పూర్తి చేయడం కష్టమని 19 శాతం మంది, వ్యాపారం కోసమేనని 16% మంది చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్టు చేస్తుందా? అన్న ప్రశ్నకు చేయదు అని 54 శాతం మంది చెప్పగా, ఏడు శాతం మంది మాత్రం అరెస్టు చేస్తారని చెప్పారు. వాళ్ళిద్దరికీ రాజీ కుదిరింది అని 14 శాతం మంది పేర్కొన్నారు. ఏమైనా జరగొచ్చని 20 శాతం మంది చెప్పారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? అన్న ప్రశ్నకు కాంగ్రెస్‌కే అని 30% మంది చెప్పగా, బీఆరెస్‌కు ఓటేస్తామని 39 శాతం మంది, ఎన్డీఏ కూటమికి వేస్తామని 19 శాతం మంది, ఇతరులకు వేస్తామని 7% మంది చెప్పారు.

ఇదిలా ఉంటే బీఆరెస్‌కు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్‌ ఫామ్ హౌస్ దాటి రాకపోవడం మంచిది కాదని కొందరు సర్వే సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కష్టం వస్తే చెప్పుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వేదికైనా ఏర్పాటు చేసింది గానీ గతంలో అది కూడా లేదని కొందరు అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడుతున్నదని పలువురు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని కొందరు వ్యాఖ్యానించినట్లు సర్వే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. రేవంత్ ఉపన్యాసాలకు అభిమానులు ఉన్నారు కానీ ఆయన పాలనకు లేరని కొందరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని కొందరు కుండబద్దలు కొట్టారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా తప్పదని కొందరు వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ డబ్బుల కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టారని మరికొందరు చెప్పారు. చేసిన మేలును కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డికి క్యాబినెట్‌ సహచరుల నుంచి పూర్తి మద్దతు లేదని కొందరు పేర్కొన్నారు. రుణమాఫీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోలేకపోతున్నారని కొందరు అన్నారు. అయితే కేసీఆర్ నిర్బంధ పాలన నుంచి విముక్తి కలిగిందని కొందరు వ్యాఖ్యానించినట్టు సర్వే సంస్థ తెలిపింది.

Exit mobile version