జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఒకప్పుడు ‘శ్రమించిన’ కేసీఆర్.. ఆ ప్రతిపక్షాలకు ఎందుకు దగ్గర కాలేక పోయారు? ఒకప్పుడు కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకులను తూలనాడినా.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అభ్యర్థికి బీఆరెస్ అధినేత ఎందుకు మద్దతు ఇచ్చారు? మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఎందుకు దగ్గర కాలేకపోయారు? ఇండియా కూటమిలో బీఆరెస్‌ను చేర్చుకోవద్దన్నామని రాహుల్ గాంధీ ఖమ్మం సభలో ఎందుకు బహిరంగంగానే చెప్పేశారు! వీటన్నింటి వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్‌లోని విశ్వసనీయ నాయకులు!
విధాత, హైదరాబాద్: ‘ఇండియా కూటమి’కి మొదట్లో దగ్గర కావాలని ఆశించిన బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు కాంగ్రెస్ వల్లే భంగపాటు ఎదురైందంటున్నాయి విశ్వసనీయవర్గాలు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు కనీసం దగ్గరకు రానివ్వడానికి ఇష్టపడక పోవడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి. రాజకీయ అవసరం ఉన్నప్పటికీ అందుకే బీఆరెస్‌ను కాంగ్రెస్ కావాలనే దూరం పెట్టిందని పేర్కొంటున్నారు.
కోపం రగిలించిన ఆ పదం..
రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేంత వరకూ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్నారు. సోనియా, రాహుల్‌గాంధీలను ఢిల్లీలోని వారి ఇంటికీ కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. వారి కుటుంబంతో గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఉద్యమం సమయంలో కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమని లీకులు కూడా వచ్చాయి. తీరా రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ.. ఇక రాజకీయ పార్టీగా కొనసాగుతుందని ప్రకటించడమే కాకుండా.. కాంగ్రెస్ వ్యతిరేక ధోరణిని పెంచుకున్నారు. ఇది కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ తర్వాతి కాలంలో ప్రత్యేకించి రాహుల్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆరెస్ నాయకులు.. కాంగ్రెస్ యువ నేతను దేశంలోనే అతి పెద్ద బఫూన్ అని కామెంట్ చేయడం గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా నొచ్చుకునేలా చేసిందని పేర్కొంటున్నారు. దీంతో కేసీఆర్‌పై వారు పట్టరాని ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు.
కాంగ్రెస్‌తో ప్రస్థానం
తెలంగాణ మలి దశ ఉద్యమం సమయంలో అప్పటి టీఆర్‌ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్‌కు నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినప్పటికీ.. సోనియా గాంధీ కేసీఆర్ పట్ల సానుభూతితో వ్యవహరించారని, యుపీఏ-2లో ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఏర్పాటుకు చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో తెలంగాణ బిల్లుపై అనేక అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ.. కేంద్రం హోంశాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నరాజీవ్ శర్మను కేసీఆర్‌కు అటాచ్ చేశారని, తెలంగాణ బిల్లులో ఎక్కడా తేడాలు రాకుండా ఉండేందుకే సోనియా గాంధీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రూఫ్ ఫోటో కూడా దిగారు. సోనియాగాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక
ఢిల్లీలో ఉన్నంత సేపు కాంగ్రెస్‌తో కలిసి ఉన్నకేసీఆర్ హైదరాబాద్ వచ్చే ముందు కొత్త లీకులు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌లో విలీనం ఉండబోదని, టీఆరెస్ రాజకీయ పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా.. దళిత ముఖ్యమంత్రి హామీని కూడా అదే సమయంలో బుట్టదాఖలైంది. హైదరాబాద్‌కు చేరుకున్నతర్వాత కాంగ్రెస్‌కు పూర్తిగా వ్యతిరేకిగా కేసీఆర్ మారిపోయారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత తన ప్రధాన శత్రువు వుగా కాంగ్రెస్ పార్టీని చూశారు. తొలి విడుత ప్రభుత్వంలోనే మిర్యాలగూడెం ఎమ్మెల్యే ఎన్ భాస్కర్‌రావును, మక్తల్ నుంచి గెలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ ఎల్పీని సైతం విలీనం చేసుకుని రాష్ట్రంలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేశారు. 2018 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై దృష్టిసారించి.. ఏకంగా సీఎల్పీనే బీఆరెస్‌ఎల్పీలో కలిపేసుకున్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనుద్దేశించి.. దేశంలోనే అతిపెద్ద బఫూన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పటికే పార్టీని విలీనం చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. రాహుల్‌ను బఫూన్ అని తిట్టడాన్ని తీవ్రంగా పరిగణించిందని చెబుతున్నారు.
బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరపుతూనే…
2014 ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో కేసీఆర్ మొదట్లో సన్నిహిత సంబంధాలే కలిగి ఉన్నారు. రాష్ట్రానికి ప్రధానిని ఆహ్వానించి, మిషన్ భగీరథ ప్రాజెక్టును ఆయన చేతులు మీదుగా ప్రారంభం చేయించారు. తాము అంశాల వారీగా రాష్ట్ర అభివృద్ధి కోసమే మద్దతు ఇస్తున్నామని చెబుతూ వచ్చారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తదితర కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ పక్షాన నిలిచింది. బీజేపీతో మంతనాలు చేస్తున్నారన్న వాదనలు రేగిన సమయంలో దానిని కప్పిపుచ్చేందుకు తాము బీజేపీకి దూరంగానే ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షాపై మీడియా సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. ఇలా బీఆరెస్ అధినేత బహుముఖంగా వ్యవహరించారన్న చర్చ రాజకీయ వర్గాలలో ఉన్నది. బీజేపీతో స్నేహ సంబంధాలున్నాయన్న ప్రచారం జరిగితే మైనార్టీలు దూరమవుతారని భావించి, తాను బీజేపీకి దూరమన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరించే వారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కానీ.. బీజేపీకి మిత్రుడనేనని సంకేతాలు ఇచ్చేందుకు 2018 ఎన్నికలకు ముందు 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపారని పరిశీలకులు చెబుతున్నారు.
2018 ఎన్నికల తరువాత
రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నింటి నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్న బీఆరెస్ అధినేత.. తన పార్టీకి ప్రత్యామ్నాయం ఉండకూడదనే భావనతో వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. రెండు ప్రతిపక్ష పార్టీలు పతనావస్థలో ఉండటంతో రాజకీయ శూన్యతలో కొందరు నాయకులు బీజేపీలో చేరారు. అప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు వచ్చింది. ఒక విధంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా కేసీఆరే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిందని భావించిన తరువాత దేశ రాజకీయాలలో చక్రం తిప్పే క్రమంలో బీజేపీ వ్యతిరేక విపక్షాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని అంటున్నారు. ఇందులో భాగంగానే 2022లో జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన విపక్షాల అభ్యర్థికే మద్దతు తెలిపారని చెబుతున్నారు. నామినేషన్ కార్యక్రమంలో కూడా స్వయంగా కేటీఆర్ పాల్గొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆరెస్‌ను జాతీయ స్థాయిలో కలుపుకొని పోయేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదని సమాచారం. బీజేపీకి పార్లమెంటులో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నది.
కాబట్టి ఫేస్ సేవింగ్ కోసం, మతోన్మాదానికి తాము వ్యతిరేకమని చెప్పుకోవడానికి మాత్రమే విపక్షాల అభ్యర్థికి ఓటు వేశారు కానీ, అంతర్గతంగా బీజేపీతో వీరికి సన్నిహిత సబంధాలున్నాయని సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆరెస్ వ్యవహారాన్ని అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాజకీయ పండితులు ఇండియా కూటమిలో చేరడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలను రాహుల్ అడ్డుకున్నట్లుగా చెపుతారు. మరోవైపు టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడేలా వివిధ రాష్ట్రాలలో విపక్ష పార్టీల నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నించడంపైనా కాంగ్రెస్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లోని ఒకరిద్దరు నేతలు సయోధ్య కుదిర్చి, ఇండియా కూటమిలోకి తీసుకునే ప్రయత్నాలు చేసినా రాహుల్, సోనియా నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు.