Site icon vidhaatha

Somashila | ప్రకృతి సోయగం ‘సోమశిల’.. బోటు షికారుకు ఇదే సమయం!

Somashila | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక ప్రాంతాల్లో సోమశిల కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కృష్ణా నదిలో కొలువైన సంగమేశ్వర దేవాలయానికి ప్రత్యేక విశిష్టత నెలకొంది. ఈ ఆలయం వేసవి లో మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. వర్షాకాలం లో కృష్ణా నది లో నీరు ప్రవహించడం తో శ్రీశైలం ప్రాజెక్టు నీటితో నిండడం తో ఈ ఆలయం నదిలో మునిగిపోతుంది. నదిలో నీరు తగ్గిన అనంతరం ఆలయం బయట పడుతుంది. దాదాపు ఎనిమిది నెలలుగా ఆలయం పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. వేసవిలో మాత్రం సంగమేశ్వర ఆలయం పూజలకు నోచుకుంటుంది. ఈ సమయంలో భక్తులు తరలి వచ్చి ఆలయం లో పూజలు చేస్తారు. మళ్ళీ కృష్ణా నదిలో ఆలయం మునిగిపోయేవరకు సంగమేశ్వరుడు పూజలు అందుకుంటాడు. ప్రస్తుతం కృష్ణా నది‌లో నీరు నిండుగా ఉండడంతో ఆలయం పూర్తిగా మునిగి ఉంది. ఈ సమయం‌లో ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణం మొదలవుతోంది.

సోమశిల చరిత్ర :
ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం సమీపంలో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతం సోమశిల. పచ్చదనంతో నిండిన ప్రకృతి దృశ్యాలు చూస్తే అదో గొప్ప అనుభూతి. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో కాటేజీలు ఏర్పాటు చేయడంతో వీకెండ్ స్పాట్‌గా ప్రసిద్ధి కెక్కింది. ఇలాంటి అందమైన సోమశిల ప్రాంత అందాల సోయగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌‌ పట్టణానికి 200 కిలో మీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది.
ఇక్కడ ఎన్నో ఆలయాల సముదాయం కొలువై ఉన్నాయి.ఏడో దశాబ్దం కాలం నాటి పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పరమశివుడికి అంకితం చేసిన ఆలయాలు కావడంతో ఇదో ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుంది. సోమశిల ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన 15 దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోమశిల జలాశయంలో ఉండే సంగమేశ్వర ఆలయం నది గర్భంలో ఉండటంతో వర్షాకాలంలో నీటిమట్టం పెరిగి మొత్తం మునిగిపోతుంది. దీంతో సంగమేశ్వర దేవాలయం 6నెలలకు పైగా నీటిలోనే ఉంటుంది. వేసవికి ముందు భక్తులకు దర్శనమిస్తుంది. ఆ సమయంలో భక్తులంతా పడవల్లో వెళ్తారు. ఒకవైపు దట్టమైన అడవులు, మరోవైపు ప్రకృతి సోయగాలు ఈ కృష్ణా నది అందాలను రెట్టింపు చేస్తాయి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే ఈ ప్రయాణం కొన్ని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

సోమశిల‌లో ప్రధాన ఆకర్షణలుగా శివాలయాలు… చూడదగ్గ ప్రదేశాల్లో సోమశిలలోని 7వ శతాబ్దపు ప్రధాన శివాలయం లలిత సోమేశ్వర స్వామి ఆలయం. వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం. సంగమేశ్వర ఆలయం సోమశిల జలాశయం మధ్యలో నిర్మించబడింది. నీటి మట్టం తక్కువగా ఉన్న ఏప్రిల్-మే నెలల్లో మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇతర సీజన్లలో, ఆలయం నీటిలో మునిగి ఉంటుంది. సోమశిల రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. దేవుళ్ల విగ్రహాలు, శిల్పాలు ప్రదర్శించే మ్యూజియాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Exit mobile version