Heartbreaking Viral Video | ఇద్దరు పండు ముసలి వ్యక్తులు తారసపడ్డారు. ఆ వ్యక్తిని చూసిన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఆ వృద్దుడి జుట్టు సవరిస్తూ, బుగ్గలు ఆప్యాయంగా తడుముతూ.. ఒక్కసారిగా తన గుండెల్లో ఏదో విస్ఫోటం చెందినట్టుగా అతడిని ఆలింగనం చేసుకుంటుంది! హృదయాన్ని తాకే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఎవరా వృద్ధులు.. ఎందుకామె అంత భావోద్వేగానికి లోనైంది?
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. ఈ జంట రెండో ప్రపంచ యుద్ధం కాలంలో విడిపోయింది. ఆ మహిళ అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తూ వచ్చింది. తన భర్త రాకకోసం ఎదరుచూస్తూ గడిపింది. అతను మాత్రం వేరే పెళ్లి చేసుకుని, పిల్లలు, మనుమలు, మునిమనుమలతో ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాలం అలా గడిచిపోయింది.
దశాబ్దాల తర్వాత.. వారిద్దరూ ఆఖరుకు 54 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఇన్నేళ్లుగా ఆశిస్తూ ఉన్నా.. ఊహించని పరిణామం! ఏం చేయాలో ఆ పండు ముసలి ప్రాణానికి పాలుపోలేదు. నోట మాటరాలేదు. తాను లేకుండా ఒక కుటుంబాన్ని నిర్మించుకున్న ఆ వ్యక్తిని చూశాక.. తన గుండెల్లో దశాబ్దాల పాటు అణచిపెట్టుకున్న బాధ, అపనమ్మకం, ప్రేమ.. ఒక్కసారిగా బద్దలయ్యాయి. అవన్నీ ఒక్క మాట కూడా లేని ఒక వీడియోలో నిక్షిప్తమయ్యాయి.
అవును.. ఆ వృద్ధురాలి నోట వెంట ఒక్కటంటే ఒక్క మాట కూడా బయటకు రాలేదు. కానీ.. ఆమెలోని భావోద్వేగాలు మాత్రం ఉప్పొంగుకొచ్చాయి. ఎదురుచూసి.. ఎదురుచూసి ఎండిపోయిన గాజు కళ్లలో మెరుపు మెరిసింది. ఆ వృద్ధుడి చెవులు పట్టుకొని మృదువుగా నొక్కతూ.. బుగ్గలను పట్టి.. ప్రేమగా కోప్పడుతూ.. అంతకు మించిన ఆప్యాయతతో అతడిని ఆలింగనం చేసుకుని మనసుతీరా విలపించిన దృశ్యం.. నెటిజన్ల హృదయాలను తాకింది.
ఎక్స్‌లో వైరల్ అయిన ఈ వీడియోపై ఒక యూజర్ ఎక్స్ చాట్‌బాట్ అయిన గ్రోక్‌ను ఈ కలయికను అభివర్ణించమని కోరగా.. ‘అవును.. ఈ వీడియోలో అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు భావోద్వేగానికిగురై.. కోప్పడుతున్నట్టుంది.. ఎందుకిలా చేశావంటూ అతడి చెవులు మెలిపెడుతూ.. కన్నీటిని, ఆలింగనాన్ని కలగలిపి.. బుగ్గ గిల్లినట్టు ఉన్నది’ అంటూ చాట్‌బాట్.. కొత్త వర్ణాన్ని అద్దింది.
ఈ పోస్టుకు ఇప్పటికే నాలుగున్నర లక్షల వ్యూస్ లభించాయి. ఇక కామెంట్ల సంగతికి వస్తే.. తమ స్పందనలతో యూజర్లు వరద పారించారు. చాలా మంది ఆమె దశాబ్దాల నిరీక్షణపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు తమ జీవితాల్లోని, ప్రేమ, ద్రోహాలను పంచుకున్నారు. ‘ఒక జంట యుద్ధం కారణంగా విడిపోవడం, ఆమె దశాబ్దాల పాటు ఎదురుచూడటం.. అతను మాత్రం తన జీవితాన్ని ఆమె లేకుండానే కొనసాగించడం.. ఇది నిజంగా చాలా బాధాకరమైన కథ’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్.. ‘ఇది హృదయాన్ని కదిలించే కథ. నేను ప్రేమించిన నాటి సంగతులు నాకు మరోసారి జ్ఞాపకం చేసింది. అవి అంతరాత్మ ఒలికించిన కన్నీళ్లు’ అని వ్యాఖ్యానించారు.
‘ఒక మహిళగా ఆ వ్యక్తిని నేను తప్పుపట్టను. ఎందుకంటే కొందరు మహిళలు కూడా ఆయనలా చేస్తుంటారు. పాత్రలు తారుమారైతే మహిళను తిడతారు. వాస్తవంలో ఇవి కేవలం నిర్ణయాలు. అయినా.. నేను ఆమె పక్షాన్నే ఉంటాను. ఆమె వాదనను అంగీకరిస్తాను. ఎందుకంటే.. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక వ్యక్తి.. ఆ మాటను వెనక్కు తీసుకున్నాడు. అప్పటినుంచి 14 ఏళ్లుగా నేను ఒంటరిగానే మిగిలిపోయాను’ అని ఒక యూజర్ రాశారు.
ఒక యూజర్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘టచ్ చేసింది. ఆమె అరుదైన ముత్యం లాంటి మహిళ. కోట్లలో ఒక్కరు అలా ఉంటారు. ఆమెది నిజమైన హృదయం’ అని రాశారు.
Married couple separated for 54 years during WW2. She never remarried, but he did and had grandchildren. pic.twitter.com/cZOAbrt3bl
— Today In History (@historigins) December 16, 2025
Read Also |
GHMC Elections | జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్ట్‌లో? 3 లేదా 4 కార్పొరేషన్ల సంగమం!
Kallem Narsimha Reddy : బతికుండగానే విగ్రహం..స్వీయ ఆవిష్కరణ!
